Andhra Pradesh: టీడీపీ-బీజేపీ పొత్తు నా మూలంగా తెగదు : సోము వీర్రాజు
- ప్రతి విషయానికి మిత్ర ధర్మం అంటగట్టడం సబబు కాదు
- టీడీపీ-బీజేపీ పొత్తు నా మూలంగా తెగదు
- బీజేపీని అల్లరి పెట్టాలని టీడీపీ ధర్నాలు చేస్తోంది
- ఓ ఇంటర్వ్యూలో సోము వీర్రాజు
టీడీపీ-బీజేపీ పొత్తు తన మూలంగా తెగదని ఏపీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో బీజేపీకి, నరేంద్రమోదీకి ప్రజాభిమానం లేకుండా చేయాలని టీడీపీ నేతలు చూస్తున్నారంటూ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని, మరి, రాష్ట్ర బడ్జెట్ లో అన్ని జిల్లాలకు న్యాయం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
ప్రతి విషయానికి మిత్ర ధర్మం అంటగట్టడం సబబు కాదని, బీజేపీ మిత్ర ధర్మంతోనే వ్యవహరిస్తోందని, టీడీపీ-బీజేపీ పొత్తు తన మూలంగా తెగదని అన్నారు. బీజేపీని అల్లరి పెట్టాలని పార్లమెంట్ వద్ద టీడీపీ ధర్నాలు చేస్తోందని, బీజేపీని అన్ని వైపుల నుంచి ముట్టడిస్తూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజాలు చెప్పిన వ్యక్తిని శత్రువుగా, అవినీతిపరుడిగా టీడీపీ చూస్తోందని, రాజకీయాల్లో ముఖ్యంగా కావాల్సింది ‘కరప్షన్’ కాదు ‘కమిట్ మెంట్’ అని, దీనిని ఆదర్శంగా తీసుకుని తాము జీవిస్తున్నామని అన్నారు.