BJP: నెటిజన్ల దెబ్బకు ఠారెత్తి... ఫేస్ బుక్ ఖాతాలో రేటింగ్, డిస్ లైక్ ఆప్షన్లు బ్లాక్ చేసిన బీజేపీ!
- బీజేపీకి నెటిజన్ల షాక్ ట్రీట్ మెంట్
- బీజేపీ ఫేస్ బుక్ పేజ్ కి డిస్ లైక్ లు, సింగిల్ స్టార్ రేటింగ్ ల హోరు
- 3 నుంచి 1.1 కి పడిపోయిన రేటింగ్
సోషల్ మీడియాతో అద్భుతాలు సృష్టించిన బీజేపీని ఇప్పుడా సోషల్ మీడియానే బెంబేలెత్తిస్తోంది. గత ఎన్నికల్లో సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజల్లోకి దూసుకెళ్లి అధికారం చేపట్టిన బీజేపీ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత విమర్శల పరంపర ఎదుర్కొంటోంది. విపక్షాల విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొడుతున్న ఆ పార్టీకి సోషల్ మీడియాలో నెటిజన్లను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతోంది. బీజేపీ అధికార ఫేస్ బుక్ పేజ్ కు డిస్ లైక్ లు కొడుతూ ‘నువ్వు మాకు నచ్చలేదు’ అని నెటిజన్లు సూటిగా చెబుతున్నారు.
ఆ పార్టీ రేటింగ్ ను కోరగా ఫైవ్ స్టార్ నుంచి సింగిల్ స్టార్ కు పడిపోయింది. బడ్జెట్ కు ముందు ఆ పార్టీ ఫేస్ బుక్ పేజ్ కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన వాళ్లు 17 వేల మంది ఉండగా ఇప్పుడు సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చిన వారి సంఖ్య 35 వేలు దాటింది. దీంతో వ్యతిరేకతను అర్థం చేసుకున్న బీజేపీ సోషల్ మీడియా విభాగం అప్రమత్తమై, తమ ఫేస్ బుక్ పేజీలో ‘డిస్ లైక్’ ఆప్షన్ ను, రేటింగ్ కోరడాన్ని బ్లాక్ చేశారు. దీంతో నెటిజన్లు ‘‘హోదా ఇవ్వలేదు... ప్యాకేజీ అంటూ ఆ నిధులూ మంజూరు చేయలేదు. రైల్వే జోన్ ప్రకటించలేదు. చివరికి.. తాజా బడ్జెట్ లో మొండిచేయి చూపారు’’ అంటూ కామెంట్లతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.