bitcoin: ఆగని బిట్ కాయిన్ పతనం... 7,000 డాలర్ల లోపునకు పడిపోయిన క్రిప్టోకరెన్సీ
- 6,853 డాలర్లకు క్షీణించిన ధర
- 5,000 డాలర్ల వరకూ పడిపోవచ్చన్న అంచనాలు
- దేశాల కఠిన నియంత్రణలతో పడిపోతున్న ధర
ఊహాజనిత కరెన్సీ అయిన క్రిప్టోకరెన్సీ 900 డాలర్ల నుంచి 20,000 డాలర్లకు ఒక్క ఏడాదిలోనే పెరిగి ఇన్వెస్టర్లను ఊహల్లో విహరింపజేసిన బిట్ కాయిన్... పీచేముడ్ తీసుకుని పతనమవుతూనే ఉంది. ఈ రోజు లగ్జెంబర్గ్ బిట్ స్టాంప్ ఎక్సేంజ్ లో ఒక బిట్ కాయిన్ ధర 6,853.53 డాలర్లకు (సుమారు రూ.4.41లక్షలు) పడిపోయింది. గత డిసెంబర్ లో దీని గరిష్ట ధర 20,000 డాలర్లు (రూ.12.86 లక్షలు)తో పోల్చి చూస్తే విలువ మూడింట రెండొంతులు ఆవిరైపోయింది. మన దేశంలోనూ బిట్ కాయిన్ పరుగులకు ఆకర్షితులై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య గడిచిన ఏడాదిలో గణనీయంగానే పెరిగింది.
ప్రపంచ ఆర్థిక రంగానికి, దేశాల అధికారిక కరెన్సీలకు హానికరంగా మారిన దీనిపై కఠిన చర్యలకు పలు దేశాలు ప్రయత్నిస్తుండడం పతనానికి కారణం. ముఖ్యంగా బ్రిటన్, అమెరికాలోని బ్యాంకులు క్రెడిట్ కార్డుల ద్వారా బిట్ కాయిన్ల కొనుగోలుకు బ్రేక్ వేయడం, మన దేశంలోనూ బిట్ కాయిన్ ను అనుమతించేది లేదని కేంద్రం స్పష్టం చేయడం తదితర కారణాలు ఈ డిజిటల్ కరెన్సీ విలువను తుడిచిపెట్టేస్తున్నాయి. సాంకేతికంగా చూస్తే బిట్ కాయిన్ విలువ 5,000 డాలర్ల వరకు క్షీణించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.