gold demand: బంగారు ఆభరణాలకు తగ్గని క్రేజ్! 2017లో కొత్త శిఖరాలకు బంగారం డిమాండ్
- మొత్తం డిమాండ్ 727 టన్నులు
- 9 శాతం అధికం
- ఆభరణాలకు వినియోగించినది 504 టన్నులు
- ప్రపంచ స్వర్ణ మండలి వెల్లడి
దేశంలో బంగారం డిమాండ్ గతేడాది (2017లో) 727 టన్నులకు చేరినట్టు ప్రపంచ స్వర్ణ మండలి భారత విభాగం డైరెక్టర్ సోమసుందరం వెల్లడించారు. ఇది అంతకముందు సంవత్సరంలో ఉన్న గణాంకాల కంటే 9.1 శాతం ఎక్కువ. సానుకూల వాతావరణం, దంతేరస్, పండుగల కారణంగా డిమాండ్ పెరిగినట్టు పేర్కొన్నారు.
‘‘డిమాండ్ ప్రధానంగా ఆభరణాల వల్లే పెరిగింది. జీఎస్టీ సమస్య సర్దుకోవడం, స్టాక్ మార్కెట్ల ర్యాలీ, జీడీపీ వృద్ధి తదితర అంశాలతో వినియోగదారుల సెంటిమెంట్ మెరుగుపడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో’’ అని సోమసుందరం వివరించారు. బంగారు ఆభరణాల విక్రయానికి యాంటీ మనీలాండరింగ్ చట్టాన్ని మినహాయించడం వల్ల డిమాండ్ పెరిగినట్టు ఆయన చెప్పారు. ఆభరణాల డిమాండ్ 12 శాతం వృద్ధితో 562.7 టన్నులుగా ఉంది. 2016లో ఇది 504.5 టన్నులే. విలువ పరంగా ఆభరణాల మార్కెట్ 9 శాతం వృద్ధితో రూ.1,48,100 కోట్లకు చేరుకుంది. బంగారంపై పెట్టుబడుల డిమాండ్ మాత్రం 2 శాతం తగ్గి 2017లో 164.2 టన్నులకు పరిమితమైంది.