Andhra Pradesh: సివిల్స్ లో ఏపీ విద్యార్థులు తమ సత్తా చాటాలి: ఏపీ డీజీపీ మాలకొండయ్య
- పోటీ పరీక్షల కరెంట్ ఎఫైర్స్ పుస్తకాల ఆవిష్కరణ
- అమరావతిలో సివిల్స్ శిక్షణతో అందరికీ అవకాశం
- డీజీపీ ఎం.మాలకొండయ్య
ఇతర పోటీ పరీక్షలలో విజయం సాధిస్తున్న తీరుగానే సివిల్స్ లో కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటాలని ఆ రాష్ట్ర డీజీపీ ఎం.మాలకొండయ్య ఆకాంక్షించారు. విజయవాడ కేంద్రంగా సివిల్స్ అభ్యర్థులకు శిక్షణను అందిస్తున్న తక్షశిల ఐఎఎస్ అకాడమీ 2017 క్యాలెండర్ సంవత్సరానికి రూపొందించిన కరెంట్ ఎఫైర్స్ పుస్తకాలను ఈరోజు ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. డిగ్రీతో పాటు సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులకు ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ, అమరావతి కేంద్రంగా సివిల్స్ పరీక్షల శిక్షణ కొనసాగాల్సి ఉందని, ఢిల్లీ వంటి దూరప్రాంతాలలో శిక్షణ తీసుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్నదని అన్నారు.
ఏపీ విద్యార్థులు ఇప్పటికే ఐఐటి, ఐఐఎం వంటి సంస్థల్లో గణనీయంగా సీట్లు దక్కించుకోగలుగుతున్నారని, అదే తీరులో సివిల్స్ పరీక్షలలో కూడా తమ సత్తా చాటాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ఇష్టాగోష్ఠిగా మాలకొండయ్య ముచ్చటించారు. అనంతరం, తక్షశిల ఐఎఎస్ అకాడమీ ఎండి, చీఫ్ ఫ్యాకల్టీ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.