Telugudesam: టీడీపీ చిత్తశుద్ధిని తప్పుబట్టే నైతిక అర్హత వైసీపీకి లేదు: టీడీపీ ఎంపీ సీఎం రమేష్
- నిరసన చేస్తున్న మాపై వైసీపీ విమర్శలు గుప్పిస్తుందా?
- రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ కు చిత్తశుద్ధి లేదు
- ఒకట్రెండు రోజుల్లో లోటు భర్తీ బకాయి నిధులు విడుదల
- మీడియాతో టీడీపీ ఎంపీ రమేష్
టీడీపీ చిత్తశుద్ధిని తప్పుబట్టే నైతిక అర్హత వైసీపీకి లేదని తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభలో నిరసన చేస్తున్న తమపై వైసీపీ విమర్శలు గుప్పించడం తగదని అన్నారు. వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి లేదని, జగన్ కు తన కేసులు తప్ప ఇతర విషయాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము చేయాల్సిందంతా చేస్తామని సీఎం రమేష్ మరోమారు స్పష్టం చేశారు. విభజన హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు కోరామని, ఏపీకి అన్యాయం జరిగిందని అన్ని పార్టీలు గుర్తించాయని, తాము చేసిన ఆందోళనతో అరుణ్ జైట్లీ ప్రకటన చేశారని, ప్రత్యేక ప్యాకేజ్, లోటు భర్తీపై స్పష్టమైన హామీ వచ్చిందని, ఒకట్రెండు రోజుల్లో లోటు భర్తీ బకాయి నిధులు విడుదల చేస్తామని చెప్పారని అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేస్తున్న విషయాన్ని సీఎం రమేష్ ప్రస్తావించారు.