Andhra Pradesh: భూములు కేటాయించినా... పనులు ప్రారంభించని సంస్థలకు నోటీసులు: మంత్రి గంటా శ్రీనివాసరావు
- కొత్తగా 8 విద్యా సంస్థలకు, పలు ప్రభుత్వ రంగ సంస్థలకు భూముల కేటాయింపు
- భూముల కేటాయింపులో సంస్థల పనితీరుకే ప్రాధాన్యం
- వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులకు 50 శాతం మేర జీతాల పెంపు-మంత్రి కామినేని శ్రీనివాసరావు
- త్వరలో పీజీ మెడికల్ విద్యార్థులకు బకాయి ఉపకార వేతనాల చెల్లింపు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కేటాయించిన భూముల్లో సేవలు ప్రారంభించని సంస్థలకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. కొత్తగా ఎనిమిది విద్యా సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూములు కేటాయించినట్లు ఆయన తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రులు కాల్వ శ్రీనివాసులు, కామినేని శ్రీనివాస్, నారాయణ, జవహర్ తో కలిసి మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడారు.
పలు విద్యా సంస్థలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు భూముల కేటాయింపుపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం నిర్వహించిందని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ సమావేశంలో దేశ, అంతర్జాతీయ స్థాయి గల 8 విద్యా సంస్థలకు డే స్కాలర్స్, రెసిడెన్సీ ఆధారంగా 3, 4, 5, 8 ఎకరాల చొప్పున భూములు కేటాయించామన్నారు. భూములు కేటాయించిన విద్యా సంస్థల్లో చిన్మయ్ మిషన్ స్కూల్, స్కాటిస్ హై ఇంటర్నేషనల్ స్కూల్, రేయాన్ గ్లోబల్ స్కూల్, పొడార్ స్కూల్, గ్లండెల్ అకాడమీ, హెరిటేజ్ ఎక్స్ పెరమెంటల్ లెర్నింగ్ స్కూల్, సద్భావన, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయని మంత్రి తెలిపారు.
వాటితో పాటు సీబీఐ, ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్శిటీ, ఇండియన్, ఆర్మీ, విదేశీ భవన్, స్టేట్ ఫోరెనిక్స్ సైన్స్ లేబొరేటరీ, ఇండియా మెట్రోలజీ డిపార్టుమెంట్ భారత్ పెట్రోల్ కార్పొరేషన్ సంస్థలకు భూములు కేటాయించామన్నారు. బ్యాంకులకు రూపొందించిన నిబంధనలను అనుసరించి, యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకుకు భూములు కేటాయించామన్నారు. ట్రాన్స్ కోకు సంబంధించి సబ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా స్థలం కేటాయించామన్నారు. ఇటీవల కాలంలో సీఆర్డీఏలో భూములకు విలువ అమాంతం పెరిగిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భూములను ఇష్టారాజ్యంగా కేటాయించడం లేదన్నారు.
ఆయా సంస్థల గత పనితీరును పరిశీలించే భూములు కేటాయిస్తున్నామన్నారు. ఇంత వరకూ ఎన్ని సంస్థలకు భూములు కేటాయించాం? వాటిలో ఆయా సంస్థల సేవలు ప్రారంభమయ్యాయా? లేదా ? అని సమీక్షించనున్నామన్నారు. సేవలు ప్రారంభించని సంస్థలకు నోటీసులు జారీ చేయాలని మంత్రి వర్గ ఉప సంఘంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మంత్రి వర్గ ఉప సంఘంలో తనతో పాటు మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణతో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.
వైద్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంపుదల...
వైద్య శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగులకు 50 శాతం మేర జీతాలు పెంచనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న 19,325 కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.219.24 కోట్లు భారం పడుతుందన్నారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల పెంపుదలపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. రూ.12 వేల కంటే తక్కువ జీతం తీసుకున్నవారికి 50 శాతం మేర జీతం పెంచాలని నిర్ణయించామన్నారు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్పేర్ ఉద్యోగులకు రూ.32.30 కోట్లు, ఏపీవీపీ ఉద్యోగులకు రూ.11.33 కోట్లు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగులకు రూ.9.38 కోట్లు, ఆయూష్ ఉద్యోగులకు రూ.41 లక్షలు, డీఎంఈ ఉద్యోగులకు రూ.16.68 కోట్లు, ఎన్.హెచ్.ఎం ఉద్యోగులకు రూ.149.14 కోట్ల మేర జీతాల రూపంలో చెల్లించనున్నామన్నారు. పీజీ, మెడికల్ పీజీ, పీడీ డిప్లమో, సూపర్ స్పెషాల్టీ కోర్సులు చదివే విద్యార్థులకు రెండేళ్లుగా రావాల్సిన ఉపకార వేతనాలతో పాటు ప్రస్తుత ఉపకార వేతనాలను చెల్లిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. పీజీలకు ఎంతమేర ఉపకార వేతనాలు ఇవ్వాలనే దానిపై కొత్తగా పే కమిటీ ఏర్పాటు చేయనున్నామన్నారు.
సీనియర్ రెసిండెంట్లకు రూ.7 కోట్ల మేర జీతాల చెల్లింపునకు జీవో జారీ చేశామన్నారు. వారికి జీతాల పెంపుదలకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి తెలిపారు. ఈ మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో మంత్రులు కాలవ శ్రీనివాసులు, గంటా శ్రీనివాసరావుతో పాలు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు...
విశాఖ రైల్వే జోన్ సాధించి తీరుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా విశాఖ, విజయవాడ మెట్రో రైల్వే ప్రాజెక్టుల నిధులు రాబట్టుతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు.