earthquake: తైవాన్ లో భారీ భూకంపం... కూలిన భారీ భవంతులు.. మిన్నంటిన ప్రజల ఆర్తనాదాలు!
- తైవాన్ తూర్పు తీరంలో 6.4 తీవ్రతతో భూకంపం
- రాత్రి 11:50 గంటలకు కంపించిన భూమి
- కుప్పకూలిన భారీ భవంతులు, పెద్దపెద్ద నిర్మాణాలు
తూర్పు ఆసియా దేశం తైవాన్ ను ప్రకృతి వణికించింది. తైవాన్ లో గత రాత్రి 11:50 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. తైవాన్ తూర్పుతీరంలోని పట్టణమైన హువాలియెన్ లో భారీ భవంతులు, ఇతర నిర్మాణాలు కుప్పకూలాయి. అర్ధరాత్రి కావడంతో కూలిన భవంతుల్లో వందలాది మంది ప్రజలు చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేస్తున్నారు. ఒక్కసారిగా పట్టికుదిపేసిన భారీ భూకంపం తరువాత సుమారు 100 సార్లకుపైగా భూమి స్వల్పంగా కంపించడంతో ప్రాణభయంతో జనం రోడ్లపై పరుగులుతీశారు.
కాగా, హువాలియెన్ కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలాజికల్ సొసైటీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఇక్కడి ప్రఖ్యాత మార్షల్ హోటల్ భవనం కూలిపోయిన దృశ్యాలు అత్యంత భీతిగొలిపించేలా ఉన్నాయి. తీవ్రమైన భూకంపం కావడంతో తైవాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. యుద్ధప్రాతిపదికన సహాయకార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.