Telangana: తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. నల్గొండ ఎన్నికల బరిలో శ్రీనివాస్ సతీమణి!
- ఇటీవల హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్
- హత్య వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని ఆరోపణ
- శ్రీనివాస్ సతీమణి లక్ష్మిని అసెంబ్లీ బరిలో దించాలని టీపీసీసీ నిర్ణయం
- లోక్సభకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల హత్యకు గురైన కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ సతీమణి, నల్గొండ మునిసిపల్ చైర్పర్సన్ లక్ష్మిని నల్గొండ నుంచి అసెంబ్లీ బరిలో దింపాలని యోచిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డిని నల్గొండ నుంచి లోక్సభ స్థానంలో బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు సమాచారం. లోక్సభకు పోటీ చేసేందుకు కోమటిరెడ్డి కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేయించాలని టీపీసీసీ భావిస్తోంది.
శ్రీనివాస్ హత్య వెనక టీఆర్ఎస్ ఉందనేది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశమే ఈ హత్య చేయించాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. హత్యకేసు నిందితులు వీరేశంతో మాట్లాడినట్టు కాల్ డేటా బయటపడడం సంచలనం సృష్టించింది. ఇక హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీని తీసుకురావాలని, అదే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలనేది తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ అది సాధ్యం కాకుంటే ఏఐసీసీ ముఖ్య నేతలతో అయినా ప్రకటన చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది.