amaravathi: అమరావతి రాజధాని పనుల కాంట్రాక్టర్లపై మంత్రి నారాయణ మండిపాటు
- రాజధాని ప్రాంతంలో రహదారి పనులను పరిశీలించిన మంత్రి
- మొత్తం 320 కిలోమీటర్ల రోడ్ల పనులు జరుగుతున్నాయి
- పనులు ఆలస్యంగా చేస్తున్న కాంట్రాక్టర్లను సహించే ప్రసక్తే లేదు
- రాజధానిలో పని చేసే కార్మికులకు మౌలిక వసతులు కల్పించని సంస్థలను తొలగిస్తాం: నారాయణ
అమరావతి రాజధాని పనుల కాంట్రాక్టర్లపై మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న రహదారి పనులను అమరావతి అభివృద్ధి సంస్థ, కాంట్రాక్టర్లతో కలిసి ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధానిలో మొత్తం 320 కిలోమీటర్ల రోడ్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు.
అమరావతిలో నిర్మించే 34 రహదారుల్లో ఇరవై నాలుగు రహదారుల పనులు వేగంగా సాగుతున్నాయని, మరో పది రహదారుల పనులకు మార్చి నెలాఖరులోపు టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. అమరావతిలో ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న గృహాలను ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పనులు ఆలస్యంగా చేస్తున్న కాంట్రాక్టర్లను సహించే ప్రసక్తే లేదని, నిర్ణీత గడువులోగా ఆయా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
రైతుల భూములకు ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని, వారికి ఇచ్చిన ప్లాట్లలో కూడా రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. ఏపీ హైకోర్టు, అసెంబ్లీ డిజైన్లు వచ్చే నెలలో వస్తాయని, రాజధానిలో పని చేసే కార్మికులకు చట్ట ప్రకారం మౌలిక వసతులు కల్పించని సంస్థలను పనుల నుంచి తొలగిస్తామని నారాయణ హెచ్చరించారు.