Telangana: ఉల్పర రిజర్వాయర్ తో ముంపు ఉండదు: మంత్రి హరీశ్ రావు
- జలసౌధలో సమీక్ష నిర్వహించిన హరీశ్ రావు
- అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంటులో లక్ష ఎకరాలకు సాగునీరు
- 25 టీఎంసీలతో ఉల్పర రిజర్వాయర్ ను నిర్మిస్తున్నాం:
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా తలపెట్టిన ఉల్పర రిజర్వాయర్ తో ముంపు ఉండదని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని జలసౌధలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం లోని సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులతో ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, అతి తక్కువ ముంపుతో, రైతాంగానికి ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులను రీ డిజైను చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఉల్పర రిజర్వాయర్ నిర్మాణం వల్ల ముంపునకు గురవుతామనే భయాందోళనలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యంపై జరుగుతున్న ఊహాగానాలను నమ్మవద్దని కోరారు. 3 టీఎంసీలు లేదా 1 టీఎంసీ కెపాసిటీతో రిజర్వాయర్ కడుతున్నారనే ప్రచారాన్ని ఖండించారు. కేవలం 25 టీఎంసీలతోనే ఉల్పర రిజర్వాయర్ ను నిర్మిస్తున్నట్టు హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ రిజర్వాయర్ పరిధిలో దాసరాజుపల్లి గ్రామం ముంపునకు గురవుతుందనే ప్రచారాన్ని నమ్మొద్దని, ఈ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ముంపునకు గురికాదని చెప్పారు. భూ నిర్వాసితులకు మార్కెట్ రేటు ప్రకారం తగిన పరిహారం చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చారు. డిండి చీఫ్ ఇంజనీర్ సునీల్, రెవెన్యూ అధికారులతో కలిసి స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచ వేస్తారని, ఈ రిజర్వాయర్ కింద రెండు పంటలకు నీళ్లందుతాయని, మత్స్యకారులకు శాశ్వత ఉపాధి లభించనుందని, ప్రస్తుతం పంటలు వేసుకొని ఉన్నందున దిగుబడి వచ్చే వరకు కాలువల తవ్వకం జరగదని చెప్పారు.
రెండు, మూడు నెలల తర్వాత ఆర్.డి.ఓ.ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని, కాలువల వెడల్పు తగ్గించి, భూసేకరణ తగ్గించాలని రైతులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రత్యామ్నాయాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. సముద్రానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న ఆమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అందించాలని అచ్చంపేట శాసనసభ్యుడు బాలరాజు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే, కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి అచ్చంపేట నియోజకవర్గానికి 50 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నామని, ఈ నియోజకవర్గంలో మొత్తం ఒక లక్ష ఎకరాలకు సాగునీరందించేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్టు హరీష్ రావు తెలిపారు.