Pawan Kalyan: రూ.24 లక్షల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత?: బడ్జెట్‌పై పవన్ కల్యాణ్
- ఏపీ సమస్యలను పట్టించుకోలేదు
- తెలంగాణలో జేఏసీ ఉన్న విధంగా ఇక్కడ కూడా ఏర్పడాల్సిన అవసరం ఉంది
- శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కూడా మాట్లాడతా
- నేను ప్రజల పక్షం.. పార్టీల పక్షం కాదు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రూ.24 లక్షల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏపీకి ఇచ్చిన నిధులపై కూడా స్పష్టత లేదని విమర్శించారు. ఏపీ గురించి సరిగ్గా పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణలో జేఏసీ ఉన్న విధంగా ఏపీలో కూడా ఏర్పడాల్సిన అవసరం ఉందని అన్నారు. హామీలు ఇచ్చినప్పుడు వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పారు.
అనంతపురం, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సీపీఐలోని కొందరు నాయకులు, మరికొందరితో కూడా జేఏసీ ఏర్పాటుపై చర్చించాల్సి ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. 2019లో బీజేపీ, టీడీపీలకు మద్దతు తెలుపుతారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా, తాను మద్దతు తెలపడమా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్న కాదని అన్నారు. ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాడడమే లక్ష్యమని చెప్పారు. తాను ప్రజల పక్షం తప్పా పార్టీల పక్షం కాదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలు చట్టంలో ఉంచిన అంశాలను కూడా చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తామని పెట్టిందని చెప్పారు.