Srinagar: అది సెంట్రల్ జైలు కాదు.. ఉగ్రవాదుల స్వర్గధామం!
- జైల్లోని ఉగ్రవాదులకు సకల సదుపాయాలు
- బయట నుంచి కావాల్సిన ఆహారం
- తరగని డేటాతో మొబైల్ ఫోన్లు
- వినోదం కోసం ఆర్కెస్ట్రా
శ్రీనగర్ సెంట్రల్ జైలుకు సంబంధించి విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. కరుడుగట్టిన ఉగ్రవాదులు ఉన్న ఈ జైలు వారికి స్వర్గధామంలా మారింది. ఇంటర్నెట్ ప్యాకేజీలతో స్మార్ట్ఫోన్లు, కశ్మీరీ మాంసాహారం, విలాసవంతమైన జీవితంతో జైలు లోపల ఉగ్రవాదులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే బయట కంటే బ్రహ్మాండమైన జీవితం అనుభవిస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది నవీద్ జాట్ తప్పించుకునే ప్రయత్నంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి.
జైలులోని సెక్యూరిటీ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. జైలు వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు జోక్యం చేసుకుంటున్నారని జైలు వర్గాలు ఆరోపించాయి. మానవ హక్కుల నేత హెచ్ఎన్ వాంఖూ హత్య కేసులో జీవిత శిక్ష ఎదుర్కొంటున్న కరుడుగట్టిన ఉగ్రవాది ఖాసిం ఫక్తు అలియాస్ ఆషిక్ ఫక్తును దేవుడిగా భావించే ఆయన భక్తులు తరచూ పదుల సంఖ్యలో జైలుకు వచ్చి కలుస్తుంటారని, ఆయనతో తావీజులు కట్టించుకుని వెళ్తారని జైలు అధికారి ఒకరు తెలిపారు.
దోషులుగా తేలిన ఉగ్రవాదులు సెల్ఫోన్లు వాడుతూ ‘తమ’ వారితోనూ, ఇతర జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారితోనూ నిత్యం ‘టచ్’లో ఉంటారని తెలిపారు. కరుడుగట్టిన యాంటీ-ఇండియా ఇస్లామిస్ట్ వ్యతిరేక నేత మసారత్ ఆలంతో కలిసి జైలులో ఆర్కెస్ట్రా కూడా నిర్వహించినట్టు జైలు వర్గాలు తెలిపాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పలు ఘటనలు ఉన్నాయని సాక్షాత్తూ జైలు అధికారులే చెబుతున్నారు.
ఇక్కడ ఉగ్రవాదులు అన్ని సౌకర్యాలను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో 20 మొబైల్ ఫోన్లను, కొంత ఉగ్రవాద ప్రేరేపిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. మొత్తంగా ఈ జైలు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని, ప్రభుత్వ పెద్దల జోక్యం ఎక్కువ కావడంతో తామేమీ చేయలేకపోతున్నామని ఉన్నతాధికారులు వాపోతున్నారు.