Supreme Court: రాముని గుడా? మసీదా?: అయోధ్యపై సుప్రీం తుది విచారణ నేటి నుంచి!
- మొత్తం 13 పిటిషన్లను విచారించనున్న సుప్రీంకోర్టు
- చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, మరో ఇద్దరితో బెంచ్
- పార్లమెంట్ ఎన్నికల వరకూ విచారణ వద్దంటున్న న్యాయవాది సిబల్
అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు నేటి నుంచి తుది విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, మరో ఇద్దరు న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ లు మొత్తం 13 పిటిషన్లపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభించనున్నారు. అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన క్రాస్ పిటిషన్లను వీరు విచారిస్తారు.
కాగా, బాబ్రీ మసీదు కేసు చివరిగా గత సంవత్సరం డిసెంబర్ 5న జరుగగా, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, విచారణ వాయిదా వేయాలని కోరిన సంగతి తెలిసిందే. జూలై 2019లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున, వాటిపై విచారణ ప్రభావం చూపుతుందని, ఎన్నికలు ముగిసేంత వరకూ కేసు విచారణ వద్దని సిబల్ వాదించారు. కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని కూడా ఆయన కోరారు. సిబల్ వాదనను అప్పట్లో తిరస్కరించిన సుప్రీంకోర్టు, ఫిబ్రవరి 8కి విచారణను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.