Tamilnadu: తమిళనాట శశికళ కాళ్లపై పడని మంత్రి లేడు!: దినకరన్ మద్దతుదారుడు తంగ తమిళ్ సెల్వన్
- అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని శశికళ కాళ్లపై పడని మంత్రి లేడు
- పదవులు పోతాయన్న భయంతో మంత్రులు ఆందోళన చెందేవారు
- వారందర్లో ధైర్యం నింపిన శశికళ ముఖ్యమంత్రి పీఠం సైతం వదులుకున్నారు
అన్నాడీఎంకే బహిష్కృత ప్రధాన కార్యదర్శి శశికళ కాళ్లపై పడని మంత్రులే లేరని టీటీవీ దినకరన్ మద్దతుదారుడైన తంగ తమిళ్ సెల్వన్ ఎద్దేవా చేశారు. తమిళనాడులోని దిండుగల్ లో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంజీఆర్ మరణానంతరం పార్టీని, రెండాకుల చిహ్నాన్ని కాపాడిన అమ్మ జయలలిత కోట్లాది మంది కార్యకర్తల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అస్వస్థతతో ఆమె ఆసుపత్రిలో చేరినప్పుడు అప్పటి మంత్రులైన ఓపీఎస్, ఈపీఎస్ సహా మంత్రులంతా పదవులు పోతాయేమోనని ఆందోళన చెందేవారని ఆయన చెప్పారు.
దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని వారంతా శశికళ కాళ్లపై పడేవారని, వారందరిలో ధైర్యాన్ని నింపి పార్టీని నిలబెట్టిన శశికళ, వారిని నమ్మి ముఖ్యమంత్రి పీఠం సైతం త్యాగం చేశారని, అలాంటి ఆమెను వారంతా వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో కేంద్రప్రభుత్వ అండదండలతో సీఎం, డిప్యూటీ సీఎం, 32 మంత్రులు ప్రచారాలు చేపట్టినా ప్రజలు వారిని నమ్మలేదని, దినకరన్ కు అఖండ విజయం చేకూర్చారని ఆయన తెలిపారు. త్వరలోనే ఎడప్పాడి ప్రభుత్వం కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. త్వరలో ప్రజాభీష్టం మేరకు అన్నాడీఎంకే ఆధ్వర్యంలో దినకరన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.