KVP: ఎట్టకేలకు కేవీపీకి మాట్లాడే అవకాశం ఇచ్చిన వెంకయ్యనాయుడు!
- నాలుగు రోజులుగా నిలబడే నిరసన తెలుపుతున్న కేవీపీ
- సీట్లో కూర్చుంటే మాట్లాడేందుకు అవకాశం ఇస్తానన్న వెంకయ్య
- యువత ఆగ్రహంగా ఉన్నారని చెప్పిన కేవీపీ
- వెంటనే హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్
గడచిన నాలుగు రోజులుగా ఏపీకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ తరఫున ఒంటరి పోరు చేస్తున్న ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు ఎట్టకేలకు రాజ్యసభలో మాట్లాడే అవకాశాన్ని చైర్మన్ వెంకయ్యనాయుడు ఇచ్చారు. నిన్న తనకు కాంగ్రెస్ సభ్యులెవరూ మద్దతు పలకలేదన్న మనస్తాపంతో సభను వీడిన కేవీపీ, నేడు కూడా ప్లకార్డు పట్టుకుని వెల్ లో నిలబడగా, మీ స్థానంలోకి వెళ్లి కూర్చుంటే మాట్లాడే అవకాశం ఇస్తానని వెంకయ్య చెప్పడంతో కేవీపీ అంగీకరించారు.
సమస్య పరిష్కారానికి మార్గం మాత్రమే చెప్పాలని, ప్రసంగించేందుకు తాను అనుమతించనని వెంకయ్య చెప్పగా, ఆంధ్రప్రదేశ్ యువత ఎంతో ఆగ్రహంతో ఉన్నారని, వారందరి తరఫునా తాను మాట్లాడుతున్నానని, తనకు ఎంత సమయం ఇస్తారో చెప్పాలని కేవీపీ అడిగారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉన్న చైర్మన్, తన మాటలను వినాలని కోరారు. బీజేపీ తక్షణమే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సభ సాక్షిగా హామీ ఇవ్వాలని కోరారు. మనం ఇక్కడ కూర్చుని ప్రజా సమస్యలను ఏం పరిష్కరిస్తున్నామని ప్రశ్నించారు. వెంటనే విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.