komatireddy venkatreddy: కేటీఆర్ సవాలును స్వీకరిస్తున్నా...ఉత్తమ్ తో పాటు నేను కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటా: కోమటి రెడ్డి
- కేటీఆర్ సవాల్ ను స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- ఉత్తమ్ తో పాటు నేను కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటా
- మిషన్ భగీరధ, ఫైబర్ గ్రిడ్ కంపెనీల్లో సగం కేటీఆర్ కి చెందినవి
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం చేస్తారా? అంటూ తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దానిపై మాజీ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.
కేటీఆర్ సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తాను కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన ప్రతిసవాల్ విసిరారు. టీఆర్ఎస్ అసమర్థత కారణంగానే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావడం లేదని ఆయన విమర్శించారు.
మోదీని విమర్శిస్తే తమ కుటుంబం జైల్లో ఉంటుందన్న భయంతోనే కేసీఆర్ నోరు మెదపడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ, ఫైబర్ గ్రిడ్లలో సగం కంపెనీలు కేటీఆర్ వేనని ఆయన విమర్శించారు. దళితుడిని తెలంగాణకు సీఎం చేయకపోతే తల నరుక్కుంటానని కేసీఆర్ చెప్పిన మాట ఏమైందని? ఆయన నిలదీశారు.
ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో మొత్తం కేసీఆర్ కుటుంబమే ఉందని ఆయన విమర్శించారు. 'టీఆర్ఎస్ తలుపులు తట్టీ తట్టీ కుదరక కోమటిరెడ్డి వెనక్కి పోయారు' అని కేటీఆర్ అంటున్నారని, తన ఆఫీస్ కు వచ్చి మంత్రి పదవి ఇస్తానని ఆయన ఆఫర్ చేశారని.. కావాలంటే అందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ బయట పెడతానని కోమటిరెడ్డి హెచ్చరించారు.