YSRCP: మా పార్టీ ఎమ్మెల్యేలతో టీజీ వెంకటేష్ బేరసారాలాడుతున్నారు!: విజయసాయిరెడ్డి ఆరోపణ

  • రాష్ట్రపతి కోవింద్ ని కలిసిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి
  • రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకే అందరినీ కలుస్తున్నా
  • ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోని విషయంపై, టీజీ వెంకటేశ్ పై కోవింద్ కు ఫిర్యాదు చేశా

తమ పార్టీ ఎమ్మెల్యేలతో టీడీపీ బేరసారాలాడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఈరోజు సాయంత్రం ఆయన కలిశారు. అనంతరం, విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ సభ్యుడిగా ఎవరినైనా కలిసే అధికారం తనకు ఉందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే క్రమంలో భాగంగానే అందరినీ కలుస్తున్నానని అన్నారు. విభజన చట్టంలో అమలు కాని అంశాలను కోవింద్ కు వివరించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టీడీపీ మంత్రులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, రాష్ట్రపతి ప్రసంగాన్ని కేబినెట్ లో ఆమోదించిన తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 74,75 ను వారు అతిక్రమిస్తున్నారనే విషయాన్ని కోవింద్ కు వివరించి చెప్పినట్టు పేర్కొన్నారు.

స్పీకర్ తీరును వివరించా..
 
తమ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను టీజీ వెంకటేష్ లాక్కెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు. మా పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి, ఓ సందర్భంలో వారిని కలిశారని, టీడీపీలోకి వచ్చేయమని వారిని కోరినట్టు తమకు తెలిసిందని ఆరోపించారు. వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చేస్తే ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు, వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చి, ప్రచారానికి అయ్యే ఖర్చంతా తాము భరిస్తామని వెంకటేశ్ చెప్పినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా స్పీకర్ వ్యవహరిస్తున్న తీరును కూడా కోవింద్ కు చెప్పినట్టు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

జగన్ పాదయాత్ర గురించి రాష్ట్రపతి వాకబు! 


జగన్ తలపెట్టిన పాదయాత్ర, ఆయన బాగోగులు గురించి రామ్ నాథ్ అడిగారని చెప్పారు. చంద్రబాబునాయుడులా తామేమీ అవినీతికి పాల్పడటం లేదని, ప్రతివిషయంలో లంచాలు తీసుకోవడం లేదని, చిత్తశుద్ధితో తాము పని చేస్తున్నామని అన్నారు. అలాంటప్పుడు మాపై చంద్రబాబు ఆరోపణలు చేయడం, 'ఖబడ్డార్’ అని అనడం సబబు కాదని, ఆయన ఏం చేసుకుంటారో అది చేసుకోవాలని విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము భయపడాల్సిన అవసరం, భయపడే పరిస్థితులు తమకేమీ లేవని అన్నారు.

  • Loading...

More Telugu News