Andhra Pradesh: చంద్రబాబు ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు సుజనా చౌదరి సిద్ధంగా ఉన్నారు: మంత్రి నారాయణ
- రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
- వామపక్షాలు తలపెట్టిన బంద్ కు టీడీపీ కూడా మద్దతిచ్చింది
- అమరావతి నిర్మాణం కోసం కేంద్రానికి డీపీఆర్ పంపామన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయంపై లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎటువంటి నిర్దిష్ట ప్రకటన చేయకపోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు ఆదేశిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీనామా చేసేందుకు కేంద్ర మంత్రి సుజనా చౌదరి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈరోజు వామపక్షాలు తలపెట్టిన బంద్ కు టీడీపీ కూడా మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రానికి డీపీఆర్ పంపామని చెప్పారు.
కాగా, పార్లమెంట్ లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. జైట్లీ ప్రకటనపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ, తన స్థానంలో నిల్చొని నిరసనలు కొనసాగించానని, జైట్లీ సమాధానం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుందనే నమ్మకం సన్నగిల్లుతోందని, ప్రజాప్రతినిధులుగా తాము చేయాల్సింది చేశామని, ఇక ప్రజలే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.