Telugudesam: జైట్లీ ప్రకటనను అడ్డుకొని ఉంటే బాగుండేదని అనిపిస్తోంది: గల్లా జయదేవ్
- ఆర్థిక మంత్రి ప్రకటన నిరాశ కలిగించింది
- జైట్లీ ఏదో చెబుతారన్న ఆశతో వెల్ లో మౌనంగా నిరసన తెలిపాం
- చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం : గల్లా జయదేవ్
ఏపీకి ప్రత్యేక సాయంపై లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఎటువంటి నిర్దిష్ట ప్రకటన చేయకపోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఢిల్లీలో ఈ విషయమై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, లోక్ సభలో జైట్లీ ప్రకటన నిరాశ కలిగించిందని అన్నారు. జైట్లీ ఏదో చెబుతారన్న ఆశతో వెల్ లో మౌనంగా నిరసన తెలిపామని, ఆయన ప్రకటనను అడ్డుకొని ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోందని అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
రాష్ట్ర ప్రజలకు మా మొహం ఎలా చూపించాలి?: మాగంటి బాబు
టీడీపీకి చెందిన మరో ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పాలి? మా మొహం ఎలా చూపించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు ఇచ్చినప్పుడు ఏపీకి ఎందుకివ్వరు? మేము మిత్రపక్షమే కదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.