Chandrababu: నిరసనల జోరు పెంచండి... సస్పెండ్ చేస్తే చూసుకుందాం: చంద్రబాబు
- మరింత ఉద్ధృతంగా నిరసనలు తెలపండి
- సస్పెండ్ చేస్తే పార్లమెంట్ బయట ఆందోళన
- ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు
బడ్జెట్ తొలి విడత సమావేశాల్లో గత కొన్ని రోజులుగా తెలుపుతున్న నిరసనలను నేడు మరింత ఉద్ధృతం చేయాలని తన పార్టీ ఎంపీలకు చంద్రబాబునాయుడు సూచించారు. ఈ ఉదయం ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, నిన్నటి జైట్లీ ప్రసంగం ఏ మాత్రం ఆశాజనకంగా లేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ప్రారంభం కాగానే, సభలో ఉండే ఆందోళన సాగించాలని, మరింతగా నిరసన తెలపాలని సూచించిన ఆయన, సస్పెండ్ చేసినా ఫర్వాలేదని అన్నారు. సభ్యులను సస్పెండ్ చేస్తే, పార్లమెంట్ బయట ఆందోళన కొనసాగించాలని అన్నారు.
నేటి సాయంత్రం వరకూ కేంద్రం నుంచి ఏదైనా సానుకూల స్పందన వస్తుందేమో వేచి చూద్దామని చెప్పారు. సభ వాయిదా పడిన తరువాత అందరు ఎంపీలతో అమరావతిలో సమావేశం నిర్వహిస్తానని, తదుపరి విషయాలు అక్కడ చర్చించుకుందామని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే నెల 5 నుంచి బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభమవుతాయని గుర్తు చేసిన ఆయన, ఈలోగా నిర్దిష్ట కార్యాచరణను రూపొందించుకుందామని తెలిపారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ ఇదే విధమైన నిరసన తెలపాలని ఎంపీలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.