raghuveera reddy: మేము ఇంతకన్నా నష్టపోయేది ఏమీ లేదు: పార్లమెంటు ప్రాంగణంలో రఘువీరా
- టీడీపీ, వైసీీపీ ఎంపీలు రాజీనామా చేయాలి
- అందరం కలసి పోరాడదాం
- బీజేపీని రాష్ట్రం నుంచి తరిమికొడదాం
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు బీజేపీ యత్నిస్తుంటే... ఆ పార్టీకి టీడీపీ, జగన్ పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు తెలుపుతున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రజల హక్కులను ఈ రెండు పార్టీలు నాశనం చేస్తున్నాయని విమర్శించారు. వెంకటేశ్వరస్వామి పాదాల చెంత ఇచ్చిన హామీలను ప్రధాని మోదీ తుంగలో తొక్కారని, ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఏకమై, కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ ఎంపీలతో కలసి మీడియాతో మాట్లాడుతూ, రఘువీరా ఈ వ్యాఖ్యలు చేశారు.
అందరం ఏకమై, బీజేపీని సంఘ బహిష్కరణ చేసి, రాష్ట్రం నుంచి తరిమికొడదామని రఘువీరా అన్నారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు మోదీని చూసి భయపడరాదని... ఎంపీలంతా వెంటనే రాజీనామాలు చేయాలని సూచించారు. బీజేపీకి ఒకరు ప్రభుత్వంలో ఉన్న మిత్రపక్షమని, మరొకరు ప్రభుత్వం బయట ఉన్న మిత్రపక్షమని... అందుకే ఆ రెండు పార్టీలను ఈ మేరకు కోరుతున్నానని చెప్పారు.
ఏపీ ప్రజల ఆంకాంక్షకు అండగా నిలబడాల్సిన బాధ్యత మీ రెండు పార్టీలపై ఉందని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం తాము ప్రయత్నం చేయడం లేదని... ఇప్పటికే తాము పూర్తిగా నష్టపోయామని, ఇంతకన్నా నష్టపోయేదీ ఏమీ లేదని తెలిపారు. మీరు కూడా రాజకీయ ఆపేక్ష లేకుండా పోరాటం చేయాలని అన్నారు. రాజధాని నిర్మాణానికి, పోలవరంకు, కేంద్ర సంస్థల ఏర్పాటుకు వేలాది కోట్ల రూపాయలు అవసరమైతే... ఇప్పటి వరకు ముష్టి వేసినట్టు నిధులు ఇచ్చారంటూ బీజేపీపై మండిపడ్డారు. బీజేపీని తరిమికొడదామని పిలుపునిచ్చారు.