thieves: 50 తులాల నగలు పోయాయని ఫిర్యాదు చేస్తే.. .62 తులాల నగలు ఇచ్చారు!
- రాజేంద్రనగర్ గోల్డెన్ హైట్స్ లో దొంగతనం
- 50 తులాల బంగారం దొచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు
- 62 తులాలు రికవరీ చేసిన పోలీసులు
50 తులాల బంగారం పోయిందని ఫిర్యాదు ఇచ్చిన బాధితులకు 62 తులాల బంగారు నగలను పోలీసులు అప్పజెప్పిన ఆసక్తికర ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ హైట్స్ కాలనీలోని మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ నివాసంలో ఈనెల 5 తెల్లవారు జామున దొంగతనం జరిగింది.
ఇంట్లోని బంగారం మొత్తం ఎత్తుకెళ్లారని, వాటి బరువు సుమారు 50 తులాలు ఉంటుందని వారు పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇలాంటి దొంగతనాల రికార్డు కలిగిన అబ్దుల్ జహీర్ (20) ను అదుపులోకి తీసుకున్నారు. బోరబండలో ప్లంబర్ గా పనిచేసే జహీర్ ఇలాంటి దొంగతనాల్లో భాగంగా గతంలో జైలుకి కూడా వెళ్లొచ్చాడు.
దీంతో అతనిని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అతని వద్ద నగలు స్వాధీనం చేసుకుని తూకం వేయగా వాటి బరువు 62 తులాలుగా పోలీసులు గుర్తించారు. దీంతో బాధితులను పిలిపించగా, స్టేషన్ కు చేరుకున్న వారు నగలను పరిశీలించి, ఆ నగలన్నీ తమవేనని తెలిపారు. చోరీ జరిగిన ఆందోళనలో పోయిన నగల బరువును కచ్చితంగా చెప్పలేకపోయామని వారు వివరించారు.
దీంతో ఆ మొత్తం నగలు వారికి అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. చోరీ కేసును ఛేదించి, నిజాయతీగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.