Madras high court: తండ్రి ఆస్తులే కాదు..అప్పులూ తీర్చాల్సిందే!: మద్రాస్ హైకోర్టు తీర్పు

  • కార్మికుడి కుటుంబానికి పరిహారం కేసులో తీర్పు
  • రుణం చెల్లించకపోవడం పాపమని వ్యాఖ్య
  • మరో రెండు నెలల్లో పరిహారం మొత్తాన్ని చెల్లించాలని ఆదేశం

మద్రాస్ హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పునిచ్చింది. తండ్రి మరణానంతరం సంక్రమించే ఆస్తులతో పాటు తన అప్పులను కూడా వారసులు తీర్చాలని స్పష్టం చేసింది. తన తండ్రి నివాసంలో పనిచేస్తూ మరణించిన ఓ కార్మికుడి కుటుంబానికి చెల్లించని నష్టపరిహారాన్ని ఆయన తనయుడు చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. చెన్నైలోని సైదాపేటలో సదరు కార్మికుడు మరణించి 17 ఏళ్లయిన తర్వాత కోర్టు ప్రస్తుతం ఈ మేరకు తీర్పునివ్వడం గమనార్హం.

తీర్పు సందర్భంగా జస్టిస్ ఎస్ వైద్యనాథన్ మాట్లాడుతూ..."మన పురాణ ధర్మశాస్త్రాల్లో నైతిక బాధ్యతల ప్రస్తావన ఉంది. ఆ ప్రకారం, రుణం చెల్లించకపోవడం పాపం కిందకు వస్తుంది. అది పై లోకంలో తీవ్ర నరకానికి గురిచేస్తుంది. రాముడి తన తండ్రి మాటకు కట్టుబడిన రీతిలో పిటిషనర్‌కి బాధిత కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంది" అని అన్నారు.

ఆగస్టు 26, 2001న మరణించిన నరసింహన్ చట్టబద్ధ వారసురాలు ఆదిలక్ష్మీకి రూ.10 లక్షల పరిహారాన్ని చెల్లించాలంటూ ఆగస్టు 21, 2017న చెన్నై కార్పొరేషన్ జారీ చేసిన ఆదేశాన్ని సవాలు చేస్తూ ఎ.రవిచంద్రన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ మేరకు వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి తమ తండ్రి ఎప్పుడో పరిహారం చెల్లించాడని పిటిషనర్ వాదించాడు.

నిజానికి ఘటన జరిగిన తర్వాత 15 ఏళ్ల వరకు ఆదిలక్ష్మీ మౌనంగానే ఉన్నదని, కానీ 2016లో చెన్నై కార్పొరేషన్ ఆమె తరపున నష్టపరిహారం కోరిందని, ఇదంతా తర్వాత పుట్టిన ఆలోచన అని పిటిషనర్ వాదించాడు. అందువల్ల కార్పొరేషన్ ఆదేశాన్ని కొట్టివేయాలంటూ ఆయన కోర్టును కోరారు. కానీ, కోర్టు ఆయన విన్నపాన్ని తోసిపుచ్చుతూ మరో రెండు నెలల్లో మొత్తం పరిహారాన్ని బాధిత కుటుంబానికి చెల్లించాలని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News