Himachal Pradesh: మణిపూర్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా మాజీ సీఎం వీరభద్రసింగ్ కుమార్తె

  • ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ నజ్మాహెప్తుల్లా
  • 1984లో అడ్వకేట్‌గా ప్రస్థానం ప్రారంభించిన అభిలాష కుమారి
  • హాజరైన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత

హిమాచల్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమార్తె అభిలాష కుమారి శుక్రవారం మణిపూర్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్, డిప్యూటీ సీఎం వై.జోయ్‌కుమార్, స్పీకర్ వై.ఖేమ్‌చంద్, ప్రతిపక్ష పార్టీ నేత ఓ.ఇబోమి, జస్టిస్ ఎన్.కోటేశ్వర్ తదితరులు హాజరయ్యారు. గవర్నర్ డాక్టర్ నజ్మా హెప్తుల్లా కొత్త సీజేతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఢిల్లీ  యూనివర్సిటీలో చదువుకున్న అభిలాష కుమారి హిమాచల్‌ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1984లో అడ్వకేట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన ఆమె అనంతరం అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. 2005లో గుజరాత్ హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. ఇప్పుడు మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించారు.

కాగా, వీరభద్రసింగ్‌ ప్రస్తుతం పలు అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సొమ్ము రూ.10 కోట్లను అక్రమంగా కుటుంబ సభ్యులకు బదిలీ చేసిన ఆరోపణలపై ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

  • Loading...

More Telugu News