keshineni nani: చంద్రబాబు వుండగా ఆంధ్రప్రదేశ్లో జేఏసీ ఎందుకు?: కేశినేని నాని
- జేఏసీ కోసం పవన్ ప్రయత్నాలు
- చంద్రబాబు ఉండగా ఆ అవసరం లేదు
- చంద్రబాబు నిర్ణయం మేరకు మేము ముందుకు వెళతాం
- కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హామీలను, చెప్పే మాటలను నమ్మేది లేదు
తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ని ఏర్పాటు చేయాలని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రయత్నాలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన ఇప్పటికే కొందరిని కలిశారు. ఈ విషయమై స్పందించిన ఎంపీ కేశినేని నాని చంద్రబాబు సీఎంగా ఉండగా జేఏసీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరమేలేదని చెప్పారు.
ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హామీలను, చెప్పే మాటలను నమ్మేది లేదని అన్నారు. రాష్ట్రానికి నిధులివ్వాలని, చేతల్లో మాత్రమే చూపాలని అన్నారు. వచ్చే నెల 5న ఉభయ సభలను స్తంభింపజేస్తామని అన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని జాతీయ పార్టీలన్నీ అంగీకరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు నిర్ణయం ప్రకారం ముందుకెళతామని చెప్పారు.