Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు!
- జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడిపై దద్దరిల్లిన అసెంబ్లీ
- పాకిస్థాన్ కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యుల నినాదాలు
- నేను ముస్లింను కనుక, ఈ నినాదాలను భరించలేకపోయా
- అందుకే, ‘పాకిస్థాన్ జిందాబాద్’ అన్నానంటూ ఎన్సీ ఎమ్మెల్యే మహహ్మద్ అక్బర్ లోనే వ్యాఖ్యలు
సంజ్ వాన్ ప్రాంతంలోని ఆర్మీ శిబిరంపై జరిగిన ఉగ్ర దాడి సంఘటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. ఈ దాడిని నిరసిస్తూ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. అయితే, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్ సీ) ఎమ్మెల్యే మహమ్మద్ అక్బర్ లోనే మాత్రం పాక్ కు వంత పాడారు. ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ కవీందర్ గుప్తా ప్రకటించారు.
బీజేపీ సభ్యుల నినాదాలు భరించలేకపోయా!: మహమ్మద్ అక్బర్
ఈ విషయమై మహ్మమద్ అక్బర్ మీడియాతో మాట్లాడుతూ, ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలను మహమ్మద్ అక్బర్ సమర్థించుకున్నారు. ‘నేను మొదట ముస్లింని. ‘పాకిస్థాన్ నశించాలి’ అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను.. భరించలేకపోయాను. నా భావోద్వేగాలను అణచుకోలేకపోయాను. అందుకే, ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాను’ అని అక్బర్ అన్నారు.
అంతేకాకుండా, ఈ విషయమై ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. ‘అవును, ఆ నినాదాలు నేను చేశాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సభలో నేను చేసిన ఈ నినాదాలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తాయని నేను భావించట్లేదు’ అని పేర్కొనడం గమనార్హం.
కాగా, జమ్మూకశ్మీర్ లోని సంజ్ వాన్ ప్రాంతంలోని ఆర్మీ శిబిరంపై ఈరోజు తెల్లవారుజామున ఉగ్ర దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయపడ్డారు. ఆర్మీ క్యాంపు పక్కన ఉన్న సైనికుల క్వార్టర్స్ నుంచి ఉగ్రవాదులు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.