Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేస్తోంది: కంభంపాటి హరిబాబు
- రెవెన్యూ లోటు భర్తీ, విభజన హామీలకు మోదీ కట్టుబడి ఉన్నారు
- నాబార్డు ద్వారా ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిధులు ఇచ్చే ప్రయత్నం
- పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తనదంటూ నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు
- ఇప్పుడు ఏపీలో విద్యుత్ కోతలు కూడా లేవు
ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీకి రెవెన్యూ లోటు, ప్రత్యేక ప్యాకేజీ, కేటాయించాల్సిన సంస్థలపై చర్చలు కొనసాగిస్తూనే ఉందని చెప్పారు. ఇప్పటికే ఏపీలో గిరిజన యూనివర్సిటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు అంగీకరించిందని చెప్పారు. రెండు విశ్వ విద్యాలయాలకు రూ.10 కోట్ల చొప్పున ఇచ్చిందని, కడప స్టీల్ ప్లాంట్ పై కూడా దృష్టి పెట్టిందని చెప్పారు.
పోలవరం నిర్మాణానికి ఇప్పటికే రూ.4 వేల కోట్లకు పైగా ఇచ్చిందని హరిబాబు అన్నారు. ఉజ్వల్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏపీ పూర్తి స్థాయిలో వినియోగించుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల వినియోగంతో ఏపీలో ఇప్పుడు 24 గంటల విద్యుత్ సరఫరా అవుతోందని తెలిపారు. 2014కంటే ముందు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, ఏపీలో విద్యుత్ కోతలు ఉండేవని ఇప్పుడు ఆ సమస్యలు లేవని అన్నారు. రెవెన్యూలోటు భర్తీ, విభజన హామీలకు మోదీ కట్టుబడి ఉన్నారని తెలిపారు.
ఏపీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. పోలవరం కోసం 7 ముంపు ప్రాంతాలను ఏపీలో కలుపుతూ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే మోదీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పోలవరం విషయంలో మోదీకి ఉన్న చిత్తశుద్ధి ఇంతకంటే రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. నాబార్డు ద్వారా ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిధులు తీసుకునేలా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తనదంటూ నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని కంభంపాటి హరిబాబు తెలిపారు. ఐదేళ్లకు సంబంధించిన రెవెన్యూ లోటు దాదాపు 22 వేల కోట్ల రూపాయలు వస్తుందని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను అనుసరించి కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తూనే ఉందని అన్నారు. ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉందనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మిగిలిన రెవెన్యూ లోటును కూడా చెల్లిస్తుందని తెలిపారు. దుగరాజపట్నం పోర్టుకు అభ్యంతరాలు వచ్చాయని, ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదశ్ లో భారీ ఎత్తున జాతీయ రహదారులను నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు.