India: పెట్రోలు ధరలు మరింతగా పెరిగే అవకాశం: అరుణ్ జైట్లీ
- క్రూడాయిల్ మార్కెట్లో అనిశ్చితి
- ఆ ప్రభావం ఇండియాపై కూడా
- రాష్ట్రాలు సుంకాలను తగ్గించాలి
- ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ
అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్లో ధరల అనిశ్చితి కొనసాగుతున్నందున, ఆ మేరకు భారత్ పైనా ప్రభావం పడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో సమావేశమైన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు. ఇండియాలో పెట్రోలు ధరలు పెరిగే అవకాశాలపై స్పందిస్తూ, ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరల సరళి ప్రకారం, ధరల్లో మార్పు తప్పదని అన్నారు.
రాష్ట్రాలు విధిస్తున్న సుంకాలను తగ్గిస్తే ప్రజలకు ఊరట లభిస్తుందని చెప్పారు. క్రూడాయిల్ ధరలు ఏ వైపునకు సాగుతాయో అంచనా వేసే పరిస్థితి లేదని తెలిపారు. పరపతి విధాన సమీక్షలు దేశాభివృద్ధికి దోహదపడేలా ఉండాలి తప్ప, రోజురోజుకూ మారే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని విధానాలను మార్చుకుంటూ పోరాదని సూచించారు. ఇండియాలో రుణ లభ్యత పెరుగుతోందని, నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు బ్యాంకుల వద్ద నిధులను పెంచాయని అన్నారు. కాగా, ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారల్ కు 60 డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే.