Pawan Kalyan: నేడు పవన్ కల్యాణ్ తో కీలక చర్చలు జరపనున్న ఉండవల్లి అరుణ్ కుమార్!
- మరికాసేపట్లో ఉండవల్లితో పవన్ చర్చలు
- హోదా, విభజన చట్టంపై చర్చలు
- జేఏసీ ఏర్పాటుపైనా సలహా కోరనున్న పవన్
- రాజకీయ వర్గాల్లో నెలకొన్న ఆసక్తి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను నేడు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ కలుసుకోనున్నారు. ఉండవల్లి ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా, మరికాసేపట్లో జనసేన కార్యాలయంలో వీరిద్దరి భేటీ సాగనుంది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరూ చర్చిస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే తానో జేఏసీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని చెప్పిన పవన్, అందులోకి లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
విభజన హామీల అమలు కోసం మేధావులు, ఇతర పార్టీల నేతలతో కలసి ఉమ్మడి పోరుకు పిలుపునిచ్చిన పవన్ పలువురిని ఆహ్వానించి చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే జేపీ, పవన్ ల మధ్య చర్చలు జరిగాయి. అయితే, ఈ చర్చల అనంతరం జేపీ చేసిన వ్యాఖ్యలు సంచలనాన్నే కలిగించాయన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఆలోచనలు బాగున్నప్పటికీ, ఆయన కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నట్టు తనకు అనిపించిందని జేపీ వ్యాఖ్యానించారు. ఇక నేటి సమావేశంలో జేఏసీ ఎలా ఉండాలన్న విషయంపైనా ఉండవల్లితో పవన్ మాట్లాడుతారని సమాచారం. ఇక వీరిద్దరి మధ్యా చర్చలు ఎలా సాగుతాయన్న విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.