Rajashekhar: ఆ రక్తపు మరకలు కోడివి... డీఎన్ఏ పరీక్షలతో ఏమీ తేలదు: గ్రహణ నరబలి నిందితుడు రాజశేఖర్
- రాజశేఖర్ ఇంటి నుంచి రక్తపు మరకలు సేకరించిన క్లూస్ టీమ్
- పాప తల నుంచి సేకరించిన నమూనాలతో పోల్చుతున్న నిపుణులు
- కోడిని కోస్తే పడ్డ రక్తమేనంటున్న రాజశేఖర్
ఓ వైపు పోలీసులు గ్రహణం రోజున నరబలి ఇచ్చింది ఇంటి ఓనర్ రాజశేఖరేనని చెబుతూ, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలను నమోదు చేయడంలో విఫలం అవుతుండగా, ఈ ఘటనకూ, తనకు ఎటువంటి సంబంధమూ లేదని వాదిస్తున్న ఆయన, క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఓ గది నుంచి సేకరించిన రక్తపు మరకలపై స్పందించాడు. తన ఇంట్లో ఓ కోడిని కోశామని, బహుశా ఆ రక్తపు మరకలనే క్లూస్ టీమ్ పసిగట్టిందని చెప్పాడు.
డీఎన్ఏ పరీక్షలు చేసినా అదే తేలుతుందని, తన ఇంట్లో నరబలి జరగనే లేదని అన్నాడు. పోలీసులు రాజశేఖర్ ను ఎన్ని కోణాల్లో విచారించినా, నిజం ఇప్పటికీ వెలుగులోకి రాలేదన్న సంగతి తెలిసిందే. పాప తల నుంచి సేకరించిన నమూనాల డీఎన్ఏను, రాజశేఖర్ ఇంట్లో లభ్యమైన రక్తపు మరకల డీఎన్ఏనూ పోల్చి చూస్తున్న పోలీసులు, కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు కీలకమంటున్నారు. రాజశేఖర్ మాత్రం ఈ నివేదికతో ఏమీ తేలదని, పోలీసులు సరైన దిశగా విచారణ జరపడం లేదని, తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నాడు.