Pawan Kalyan: ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, మేధావులతో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తాం!: పవన్ కల్యాణ్
- జనసేన కార్యాలయంలో ముగిసిన పవన్- ఉండవల్లి భేటీ
- ఏపీకి మేలు జరుగుతుందంటేనే టీడీపీకి, బీజేపీకి మద్దతిచ్చా
- బీజేపీ, టీడీపీ చెబుతున్న మాటలను జేఏసీలో చర్చిస్తాం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల అందరిలాగానే తనకూ బాధగా ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్, ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్, రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ ల భేటీ ముగిసింది. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం సాగింది.
అనంతరం, పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న మాటల్లో వ్యత్యాసం ఉందని అన్నారు. ఏపీకి మేలు జరుగుతుందంటేనే 2014లో టీడీపీకి, బీజేపీకి తాను మద్దతు ఇచ్చానని, న్యాయం చేయని రెండు పార్టీలను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లూ మౌనంగా ఎందుకు ఉందని, ‘పోలవరం’పై శ్వేతపత్రం ఇవ్వమని కోరితే ఎందుకివ్వలేదని పవన్ ప్రశ్నించారు. ఈ నెల 15వ తేదీ లోగా కమిటీకి శ్వేతపత్రం ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు.
ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, మేధావులతో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తామని, బీజేపీ, టీడీపీ చెబుతున్న మాటలను జేఏసీలో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో సొంత పార్టీనే ధిక్కరించి బయటకు వచ్చిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ అని, సున్నిత విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలరనే ఉండవల్లిని తాను ఎంచుకున్నానని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం చెబితే, తాను జేఏసీ ద్వారా పరిశీలన చేయిస్తానని, నిధుల విషయంలో అందరూ అబద్ధాలాడుతున్నారని, లేదా ఎవరో ఒకరు అబద్ధం ఆడుతున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులెంత? రాష్ట్రం ఖర్చు చేసిందెంత? అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఆర్థిక నిపుణుల కమిటీ శ్వేతపత్రం పరిశీలించి వాస్తవం తేల్చుతుందని పవన్ అన్నారు.