Telugudesam: కేంద్రానికి వ్యతిరేకంగా చెన్నైలో టీడీపీ ధర్నా.. వ్యతిరేక నినాదాలు
- బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్
- కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- ఏపీలోనూ కొనసాగిన నిరసనలు
కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ టీడీపీ చెన్నై విభాగం ఆదివారం చెన్నైలో ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 200 మందికిపైగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిర్వహించిన ఈ ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి న్యాయం చేసేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ గ్రేటర్ చెన్నై కన్వీనర్ డి.చంద్రశేఖర్‌తోపాటు బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
మరోవైపు బడ్జెట్లో ఏపీకి మొండిచెయ్యి చూపడాన్ని నిరసిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇక, పార్లమెంటులో టీడీపీ సభ్యుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం వచ్చే నెల మొదటి వారంలో విశాఖ రైల్వే జోన్‌పై ఏదో ఒకటి తేలుస్తామని హామీ ఇచ్చింది.