South Africa: నాలుగో వన్డేలో గెలిచినా దక్షిణాఫ్రికాకు దక్కని ఆనందం.. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత!
- నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసిన సఫారీ జట్టు
- స్లో ఓవర్ రేటుకు మ్యాచ్ ఫీజులో పదిశాతం కోత
- కెప్టెన్ మార్క్రమ్కు 20 శాతం
- మరోసారి జరిగితే కెప్టెన్ సస్పెన్షన్
జొహన్నెస్‌బర్గ్‌లో భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న దక్షిణాఫ్రికాకు ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. స్లో ఓవర్ రేటు కారణంగా సఫారీ జట్టుకు మ్యాచ్ ఫీజులో పదిశాతం కోత పడింది. ఇక, ఇందుకు కారణమైన కెప్టెన్ మార్క్రమ్కు 20 శాతం జరిమానా విధించారు.
నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా నిర్ణీత సమయానికి ఓవర్లు వేయకుండా ఒక ఓవర్‌ను ఆలస్యం చేసింది. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్లు అలీందార్, బొంగాని జెలె, థర్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్, ఫోర్త్ అంపైర్ షాన్ జార్జ్‌లు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ దృష్టికి తీసుకెళ్లారు. స్లో ఓవర్ రేటుకు కెప్టెన్ మార్క్రమ్ కారణమని తేల్చారు.
దీనిని కెప్టెన్ కూడా అంగీకరించడంతో విచారణ అవసరం లేదని తేల్చిన రిఫరీ జట్టుకు మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. ఇందుకు కారణమైన కెప్టెన్‌కు రెట్టింపు జరిమానా ఉంటుంది. కాబట్టి మార్క్రమ్ తన ఫీజులో 20 శాతాన్ని కోల్పోనున్నాడు. 12 నెలల వ్యవధిలో ఇటువంటి తప్పే ఇంకోసారి జరిగితే కెప్టెన్ మార్క్రమ్ సస్పెన్షన్‌కు గురికావాల్సి ఉంటుంది.