Queenstown: భారత యువ ఇంజనీరుకు సైన్స్-టెక్ ఆస్కార్ అవార్డు!
- 2009లో క్వీన్స్‌టౌన్‌లో షాట్ ఓవర్ కెమేరా సిస్టమ్ కంపెనీలో చేరిక
- 'ఏరియల్ మౌంట్' వ్యవస్థపై విశేష కృషి
- కొంతకాలం పూణేలో బోధనావృత్తిలో యువ ఇంజనీరు
ముంబైలో పెరిగిన యువ ఇంజనీరు వికాస్ సతాయేని ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు వరించింది. అమెరికాలోని బెవర్లీ హిల్స్‌లో శనివారం నాడు నిర్వహించిన ఆస్కార్స్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డ్స్-2018 ప్రదానోత్సవంలో సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ అవార్డును గెల్చుకున్న నలుగురు సభ్యుల బృందంలో వికాస్ కూడా ఒకరు కావడం విశేషం. 'షాట్‌ఓవర్ కే1 కెమేరా సిస్టమ్' కాన్సెప్ట్, రూపకల్పన, ఇంజనీరింగ్, అమలుకు గాను వారికి ఈ అవార్డు లభించింది. ఈ సిస్టమ్ చాలా అద్భుతమైనదంటూ అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రశంసించింది.
అవార్డును అందుకున్న సందర్భంగా వికాస్ మీడియాతో మాట్లాడుతూ, 2009లో న్యూజిలాండ్‌లోని క్వీన్స్‌టౌన్‌లో షాట్ ఓవర్ కెమేరా సిస్టమ్ అనే ఓ కొత్త కంపెనీలో చేరినట్లు ఆయన చెప్పారు. అందులో తాను ఏరియల్ మౌంట్ వ్యవస్థపై పనిచేసినట్లు ఆయన చెప్పారు. అనేక మంది చలనచిత్ర నిర్మాతలు, దర్శకులను ఎంతగానో ఆకర్షించే క్వీన్స్టౌన్ సహజసిద్ధమైన అందం, మనోహరమైన ప్రకృతి సౌందర్యమే అక్కడ కంపెనీ ఏర్పాటుకు ప్రధాన కారణమని వికాస్ తెలిపారు.
కాగా, అంతకుముందు పూణేలోని కమిన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్‌లో ఏడేళ్ల పాటు బోధనావృత్తిలో ఆయన ఉన్నారు. ఆ సమయంలోనే ఫియట్ కంపెనీ ప్రాజెక్టు కోసం తనను ఇటలీ పంపారని, అక్కడే మూడు నెలల పాటు పనిచేశానని ఆయన చెప్పారు. ఆ అనుభవమే ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టేలా ప్రేరణ కలిగించిందని ఆయన అన్నారు.