Goa: రష్యన్లు, నైజీరియన్ల గుప్పిట్లో గోవా ప్రాంతాలు... పోలీసులకు అక్కడికెళ్లే ధైర్యం లేదంటోన్న శివసేన!
- దేశీ టూరిస్టులను తిట్టడం సరికాదన్న శివసేన
- గోవాలో విదేశీయులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్
- పార్టీ పత్రిక 'సామ్నా'లో గోవా సర్కార్‌పై ధ్వజం
గోవాలోని కొన్ని ప్రాంతాలు రష్యన్లు, నైజీరియన్ల గుప్పిట్లో ఉన్నాయని, స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లే ధైర్యం చేయలేరని శివసేన విమర్శించింది. ధైర్యముంటే విదేశీయుల ఆధిపత్యంలోని ప్రాంతాలను బీజేపీ నేతృత్వంలోని గోవా ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. గోవాకి అలగాజనమే వస్తున్నారంటూ దేశీ పర్యాటకులను దూషించడం మానాలని, చేతనైతే విదేశీయులపై ఉక్కుపాదం మోపాలని శివసేన పార్టీ తన పత్రిక 'సామ్నా'లో డిమాండ్ చేసింది.
గతవారం గోవా వ్యవసాయ శాఖ మంత్రి సర్దేశాయ్ కొంతమంది దేశీ టూరిస్టులను అలగాజనంగా అభివర్ణించిన నేపథ్యంలో శివసేన ఈ మేరకు డిమాండ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశీ పర్యాటకులపై గోవా ప్రభుత్వం అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడింది.
మరోవైపు గోవా సంస్కృతి, గోవా తత్వాన్ని దెబ్బతీసే వారిని తరిమికొట్టాలంటూ గోవా కేబినెట్లోని మరో మంత్రి మనోహర్ అజ్గావోంకర్ చేసిన వ్యాఖ్యలను కూడా శివసేన తన పత్రికలో తప్పుబట్టింది. ఉత్తర భారతీయులు గోవాను మురికికూపంగా మారుస్తున్నారని గోవా మంత్రి ఒకరు దూషిస్తున్నారని పేర్కొంది. కానీ, పర్యాటకం వల్లనే ఆ రాష్ట్రం నడుస్తోందని, అందుకే శాంతిభద్రతలను గాలికొదిలేసిందని తీవ్రస్థాయిలో విమర్శించింది.