Chandrababu: తెలిసి చేసినా, తెలియక చేసినా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం: చంద్రబాబు
- నీరు-ప్రగతి, వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి
- ప్రతిపక్షం లేఖల ద్వారా అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోంది
- రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పట్టుబట్టిన కేంద్రమంత్రి మీద ప్రతిపక్షం ఫిర్యాదులు శోచనీయం
- ప్రతిపక్ష పోకడలు ప్రజాప్రయోజనాలను కాలరాసేలా ఉన్నాయి
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయి వచ్చేదాకా చేయూత ఇవ్వాలని చెప్పారు. ఈ రోజు తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతోన్న ఎంపీలు అందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో అధికార యంత్రాంగం కూడా పనిచేయాలని అన్నారు.
మూడున్నరేళ్లుగా ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటువల్లే అన్ని సమస్యలు అధిగమించగలిగామని చంద్రబాబు నాయుడు చెప్పారు. తమ సమర్థత చూపామని, ఇకపై కూడా మరింత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనులు కొనసాగించాలని చెప్పారు.
అలా చేస్తే రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడమే...
‘ప్రతిపక్షం లేఖల ద్వారా అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పట్టుబట్టిన కేంద్రమంత్రి మీద ప్రతిపక్షం ఫిర్యాదులు శోచనీయం. తెలిసి చేసినా తెలియక చేసినా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం. ప్రతిపక్ష పోకడలు ప్రజాప్రయోజనాలను కాలరాసేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
'నరేగా' ప్రోగ్రాంపై కూడా ఫిర్యాదులు పంపడం ప్రతిపక్ష అరాచకాలకు పరాకాష్ట అని చంద్రబాబు దుయ్యబట్టారు. కన్వర్జన్స్ ద్వారా నరేగాలో ప్రతి రూపాయి ప్రజో ప్రయోగం చేశామన్నారు. నరేగా నిధులు రాష్ట్రానికి వచ్చేందుకు దోహదపడిన యంత్రాంగాన్ని అభినందించారు. రబీ వ్యవసాయ పనులు పూర్తికావచ్చాయని, రాబోయే రెండు నెలలు నరేగా పనులు ముమ్మరం చేయాలని సూచించారు. మరో కోటి 80 లక్షల మేండేట్ కు అవకాశం ఉందని, నరేగా పని దినాల లక్ష్యం చేరుకోవాలన్నారు.
116 రోజుల జలసంరక్షణ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి..
నేటినుంచి 116 రోజులు జల సంరక్షణ పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రెండవ దశ జలసంరక్షణ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చెరువుల్లో పూడికతీత, ముళ్ల కంపల తొలగింపు, గట్ల పటిష్టం తదితర పనులను ముమ్మరం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల చెరువులు, 2,500 సెలయేళ్లు, 10 వేల చెక్ డ్యామ్ లలో చేపట్టిన జల సంరక్షణ పనులను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి వర్షపు చుక్కను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాలవాగు పనుల్లో తాను స్వయంగా పాల్గొంటున్నానని, ఆయా జిల్లాలలో జరిగే పనుల్లో కలెక్టర్లు, మంత్రులు విధిగా పాల్గొనాలని ఆదేశించారు.
ఇ-నామ్ లో మనరాష్ట్రమే దేశంలో ముందుండాలి..
రబీ పంటరుణాల లక్ష్యం 76% చేరుకున్నామని, మిగిలిన రుణాలు కూడా వెంటనే అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కౌలు రైతులకు పంటరుణాల పంపిణీ శ్రీకాకుళం, కడపలో మరింత ముమ్మరం కావాలన్నారు. నీతి అయోగ్ వ్యవసాయ కమిటీ సభ్యుడు రమేష్ చంద్ర పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో.. మన రాష్ట్రంలో జరుగుతున్న ఇ-నామ్ (ఇ- నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ను ప్రశంసించారని, ఇ-నామ్ లో దేశంలో మనరాష్ట్రం ముందుండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ప్రపంచంలో మేలైన విధానాలు, శాస్త్ర సాంకేతికత రాష్ట్రంలో రైతులకు చేరువ చేస్తోన్న విషయం ప్రస్తావించి ఉద్యాన రంగం,పాడి పరిశ్రమలో మరింత పురోగతి సాధించాలన్నారు. ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిధులను పశుగణాభివృద్ధి రంగం, మత్స్య రంగాలలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు.
అతి త్వరలో లక్షన్నర గృహాల సామూహిక గృహ ప్రవేశం..
అక్టోబర్ 2న లక్ష గృహాల సామూహిక గృహ ప్రవేశం విజయవంతం చేశామని చంద్రబాబు చెప్పారు. త్వరలోనే జరిగే లక్షన్నర గృహాల సామూహిక గృహ ప్రవేశం కూడా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం రోజుకు 100 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నామని, దీనిని 150 ఇళ్లకు పెంచాలని ఆదేశించారు. ప్రతిరోజూ 150 ఇళ్ళ నిర్మాణం పూర్తికావాలన్నదే లక్ష్యంగా పేర్కొన్నారు. 2016-17 పనులు ప్రారంభం అయిన అన్ని ఇళ్లను వెంటనే పూర్తిచేయాలన్నారు.
2017- 18, 2018-19 మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. అంగన్ వాడి భవనాల నిర్మాణం ముమ్మరం చేయాలన్నారు. గాలి నాణ్యత (ఎయిర్ క్వాలిటి)లో మనరాష్ట్రమే ముందుండాలన్నారు. అటవీశాఖ మిగిలిన శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. పర్యావరణం బాగుంటే పర్యాటకంలో గణనీయ ప్రగతి సాధిస్తామన్నారు. దేశంలో ఇప్పటికే 3వ స్థానంలో ఉన్నామంటూ అగ్రస్థానం పొందే దిశగా కృషి చేయాలన్నారు. వయో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ పంపిణీ చేస్తున్న విషయం ప్రస్తావిస్తూ.. నగదు కొరత పింఛన్ల పంపిణీకి ప్రతిబంధకం కారాదన్నారు. నగదు కొరత నివారణకు ఆర్బీఐకి లేఖ రాయనున్నట్లుగా తెలిపారు.
మార్చి 31లోపు కార్మికుల బిడ్డల పేర్లు నేషనల్ పోర్టల్ లో నమోదు
‘ప్రధానమంత్రి- చంద్రన్న బీమా’ పథకంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మార్చి31లోపు కార్మికుల బిడ్డలందరి పేర్లు నేషనల్ పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. కార్మికుల బిడ్డలకు రూ.1,200 ఉపకార వేతనం అందేలా చూడాలన్నారు. దీనిపై ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు సమన్వయంగా పని చేయాలన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, జల వనరులు, వ్యవసాయం అనుబంధ రంగాలు, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు శశి భూషణ్, రాజశేఖర్, గోపాలకృష్ణ ద్వివేది, జవహర్ రెడ్డి, పంచాయతిరాజ్ కమిషనర్ రామాంజనేయులు, హవు సింగ్, రియల్ టైం గవర్నెన్స్ ఎండీలు కాంతిలాల్ దండే, అహ్మద్ బాబు, సెర్ప్ సీఈవో కృష్ణ మోహన్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.