Jagan: వైసీపీ నేతలతో ముగిసిన జగన్ కీలక భేటీ... 'ఇక పోరాటమే' అంటూ ప్రకటన!
- మా పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది- భూమన కరుణాకర్ రెడ్డి
- మార్చి 1న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
- వచ్చేనెల 3న పార్టీ నేతలు అందరూ పాదయాత్ర
- మార్చి 5న జంతర్ మంతర్ వద్ద ధర్నా
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎంపీలు, కీలక నేతలతో కీలక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయం, ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధానంగా చర్చించారు. దాదాపు రెండు గంటల పాటు భేటీ జరిగింది. అనంతరం వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాము తీసుకున్న నిర్ణయాలను తెలిపారు.
వచ్చేనెల 1న తాము రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపడతామని కరుణాకర్ రెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ జెండా ఊపి పార్టీ నాయకుల ఆందోళనలను ప్రారంభిస్తారని తెలిపారు. వచ్చేనెల 3న తమ పార్టీ నేతలు అందరూ పాదయాత్ర చేసి నిరసన తెలుపుతామని తెలిపారు. అందులో తమ పార్టీ ఎంపీలు, శాసన సభ్యులు, కీలక నేతలందరూ పాల్గొంటారని చెప్పారు. అనంతరం వచ్చేనెల 5న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతామని అన్నారు. హోదాతో సమానంగా ప్యాకేజీ అంటూ టీడీపీ కల్లబొల్లి మాటలు చెబుతోందని అన్నారు.
'ప్యాకేజీ మనకు వద్దు ప్రత్యేక హోదానే ముద్దు' అనే నినాదంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతామని తెలిపారు. రాష్ట్ర పరిస్థితులను కేవలం ప్రత్యేక హోదానే నెరవేరుస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబు ప్రభుత్వం సమాధి కట్టిందని అన్నారు.