ipl: బీసీసీఐకి కాసులు కురిపిస్తున్న ఐపీఎల్... రూ.2000 కోట్లకు పైగా మిగులు ఆదాయం
- బీసీసీఐ ఆదాయంలో 95 శాతం ఐపీఎల్ వాటాయే
- మిగిలిన ఆదాయం కంటే 16 రెట్లు అధికం
- క్రీడా సదుపాయాలపై రూ.1,272 కోట్ల వ్యయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బీసీసీఐకి కాసులు కురిపించే ధనవృక్షంగా మారిపోయింది. రానున్న ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ2,017 కోట్ల మిగులు ఆదాయాన్ని ఐపీఎల్ ద్వారా ఆర్జించనుంది. బోర్డుకు సంబంధించిన ఇతర కార్యకలాపాలు, అంతర్జాతీయ, దేశీయ మ్యాచుల ద్వారా రూ.125 కోట్ల ఆదాయం సమకూరనుంది. అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఐపీఎల్ ఆదాయమే బోర్డు మొత్తం ఆదాయంలో 95 శాతం స్థాయిలో ఉండనుంది. 45 రోజుల పాటు కొనసాగే ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం సంవత్సరంలో మిగిలిన అన్ని రోజుల్లో వచ్చే ఆదాయం కంటే 16 రెట్లు అధికం. రూ.3,413 కోట్ల ఆదాయంలో క్రీడా సదుపాయాలు, ఇతరత్రా వాటికి రూ.1,272 కోట్లను ఖర్చు చేయనుంది.