YSRCP: ఏప్రిల్ 6న వైసీపీ లోక్సభ సభ్యుల రాజీనామా: జగన్ కీలక ప్రకటన
- వచ్చేనెల 1న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు
- వచ్చేనెల 5న ఢిల్లీలో నిరసనలు
- నెలరోజులు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి
- ఏప్రిల్ 6లోపు ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకపోతే రాజీనామాలు
ఏపీకి ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి అమ్మేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా అంటే అది సంజీవని అని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు... ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలేమిటి? అని గత ఏడాది ప్రశ్నించారని, తనకు వచ్చే ప్యాకేజీల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను అమ్మేశారని ఆరోపించారు.
హోదాతో లాభం కంటే నష్టమే ఎక్కువని గత ఏడాది కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా అన్నారని జగన్ తెలిపారు. టీడీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడగడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా అనే అంశానికి సమాధి కట్టారని అన్నారు. తాను ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నానని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమం మొదలుపెట్టండని జగన్ అన్నారు.
వచ్చేనెల 1న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద తమ పార్టీ నేతలు ధర్నాలు చేపడతారని జగన్ తెలిపారు. తాను పాదయాత్ర చేస్తోన్న చోటుకి వచ్చేనెల 3న వైసీపీ నేతలు వస్తారని, ఉద్యమాన్ని తాను జెండా ఊపి ప్రారంభిస్తానని తెలిపారు. వచ్చేనెల 5న మళ్లీ పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయని, నెలరోజులు జరుగుతాయని, ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఆ ముప్పై రోజులూ తమ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే ఉంటారని తెలిపారు. ఏప్రిల్ 6 చివరి గడువని తెలిపారు. తమ పోరాటంపై స్పందించకపోతే అదే రోజు తమ లోక్సభ సభ్యులు రాజీనామా చేస్తారని ప్రకటించారు.