Andhra Pradesh: అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది?.. అన్న దానిపై ఏమైనా చర్చలు జరిగాయా?: కొత్తపల్లి గీత
- గతంలో కొత్త రాజధాని కోసం రాయ్ పూర్ కి రెండు వేల కోట్లు ఇచ్చారు
- అక్కడ బ్రహ్మాండమైన రాజధాని కట్టారు
- రెండు, మూడు వేల కోట్లతో ఏమీ చేయలేమని టీడీపీ నేతలు అంటున్నారు
- బిల్డింగులకే నలభై వేల కోట్లు అవుతాయని అన్నారు
రాష్ట్రానికి అందిన ప్రయోజనాలపై వివరాలు తెలపాలని, రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ తాను ప్రధాని మోదీ సహా అందరు కేంద్ర మంత్రులకు లేఖ రాశానని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది?.. అన్న దానిపై ఏమైనా చర్చలు జరిగాయా? అని ప్రశ్నించారు. ఒకవేళ జరిగితే ఎంత ఇస్తామన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో కొత్త రాజధాని కోసం రాయ్ పూర్ కి రెండు వేల కోట్లు ఇచ్చారని, అక్కడ బ్రహ్మాండమైన రాజధాని కట్టారని కొత్తపల్లి గీత అన్నారు. రెండు, మూడు వేల కోట్లతో ఏమీ చేయలేమని టీడీపీ నేతలు అంటున్నారని, బిల్డింగులకే నలభై వేల కోట్లు అవుతాయని అన్నారని తెలిపారు. ఇటీవల ఓ సమావేశంలో వెంకయ్య నాయుడు ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఐదారు వేల కోట్ల రూపాయలు ఇవ్వగలదని అన్నట్టు తనకు గుర్తని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ నేతలు కూడా రోడ్డు మీదికి వచ్చి ఆందోళన చేయడంతో ప్రజలు కంగారు పడుతున్నారని, ఈ విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఏం జరిగిపోతుందోనని ప్రజలు అనుకుంటున్నారని, ఈ విషయం ఏ ఒక్క పార్టీకో సంబంధించినది కాదని, మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి అందరూ మాట్లాడుతున్నారని, అయినప్పటికీ అందులోనూ ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ఎవరికి వారు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.