Ganta Srinivasa Rao: అందుకే, లోక్‌సభ సభ్యులతో జగన్ రాజీనామా చేయిస్తానన్నారు: గంటా శ్రీనివాసరావు
- గతంలోనూ జగన్ పలుసార్లు తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు
- జగన్ పాదయాత్ర పేరుతో తిరుగుతున్నారు
- దానికి స్పందన కరవైనందుకే రాజీనామా డ్రామా
- కేసుల నుంచి బయట పడేందుకే ప్రయత్నాలు
తమ లోక్‌సభ సభ్యులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రాజీనామా చేయిస్తానని నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని వైసీపీ నేతలు అన్నారని వ్యాఖ్యానించారు. గతంలోనూ జగన్ పలుసార్లు తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారని గంటా శ్రీనివాసరావు గుర్తుచేశారు. జగన్ పాదయాత్ర పేరుతో తిరుగుతున్నారని, దానికి స్పందన కరవైనందుకే రాజీనామా డ్రామాను తెరపైకి తీసుకొచ్చినట్లున్నారని అన్నారు.
వారు నిజంగా రాజీనామా చేసేవారే అయితే 2016లోనే రాజీనామా చేసి ఉంటే బాగుండేదని గంటా శ్రీనివాస రావు అన్నారు. వచ్చే ఏడాదే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయని, ఇప్పుడు ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తామంటున్నారని తెలిపారు. అప్పట్లోనే రాజీనామా చేసి ఉంటే నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనే లోక్‌సభ ఉప ఎన్నికలు పెట్టేవారని తెలిపారు. ఏప్రిల్ 6 కాకుండా ఏప్రిల్ 1న రాజీనామా చేస్తే బాగుంటుందని, ఎందుకంటే ఏప్రిల్ 1 ఫూల్స్ డే అని, అప్పుడు రాజీనామా చేస్తే వైసీపీ తీరు ప్రజలను చక్కగా ఫూల్స్ చేయడమేనని అందరికీ అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.
నేషనల్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ బీజేపీతో కలుస్తామని చెప్పారని గంటా శ్రీనివాస రావు అన్నారు. కేసులని మాఫీ చేయించుకోవడం కోసమే జగన్ ప్రయత్నాలు జరుపుతున్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీల రాజీనామా కేవలం రాజకీయ నాటకం మాత్రమేనని, జగన్ మరో నాటకానికి తెరతీశారని అన్నారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పోరాడి అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పారు.
రాష్ట్రానికి ఎవరు న్యాయం చేస్తారో ప్రజలకు బాగా తెలుసని, జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా 2014 ఎన్నికల ఫలితాలే 2019లోనూ రిపీట్ అవుతాయని చెప్పారు. జగన్ ఒక్కోసారి సైకోలా ప్రవర్తిస్తున్నారని గంటా శ్రీనివాసరావు అన్నారు. అప్పట్లో విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పోలీసులతో జగన్ ప్రవర్తించిన తీరుని ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. అనంతరం విజయవాడలో జగన్ కలెక్టర్‌తో వ్యవహరించిన తీరు కూడా ఎలా ఉందో ప్రజలకి తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి అయిపోయినట్లు జగన్ ఊహల్లో ఉన్నట్లున్నారని ఎద్దేవా చేశారు.