kamal hasan: సినిమాలకు దూరమవుతున్న ‘స్వాతిముత్యం’... రాజకీయాలకే అంకితమని కమలహాసన్ ప్రకటన
- త్వరలో రానున్న రెండు సినిమాలే ఆఖరు
- ప్రజా సేవలోనే ప్రాణాలు వదులుతా
- కాషాయ రాజకీయాలకు వ్యతిరేకం
- నా రాజకీయాలు నలుపు
ఎన్నో అద్భుత పాత్రలతో కళామతల్లికి సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న నట కమలం, పద్మభూషణుడు, ప్రముఖ నటుడు, 63 ఏళ్ల కమలహాసన్ భవిష్యత్తులో సినిమాలు చేయబోనని సంచలన నిర్ణయం ప్రకటించారు. తమిళనాడు ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలని తీసుకున్న నిర్ణయమే అంతిమమని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి వస్తున్నట్టు కమల్ రెండు నెలల క్రితమే ప్రకటించారు. ఈ నెలలో పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించనున్నారు. ‘‘త్వరలో విడుదల కానున్న రెండు సినిమాలు మినహా ఇకపై నాకు ఏ సినిమా ఉండదు’’ అని బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఇండియాటుడే న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ పేర్కొన్నారు.
ఓటమి ఎదురైనా రాజకీయాల్లోనే కొనసాగుతారా? అన్న ప్రశ్నకు ‘‘నిజాయతీగా జీవించేందుకు ఏదైనా చేయాలనుకుంటున్నాను. నేనేమీ ఓడిపోతాననుకోవడం లేదు. నాకు రాజకీయ సంస్థ లేకపోవచ్చు. అయినా 37 ఏళ్లుగా సామాజిక సేవలో ఉన్నా. ఈ కాలంలో 10 లక్షల మంది నమ్మకమైన కార్యకర్తలను సమీకరించాం. నా ఆదేశాలతో వారు మరెంతో మందిని ఇందులో భాగస్వాములను చేశారు’’ అని కమల్ తెలిపారు.
‘‘నాకు సంపాదన ఉంది. నా బ్యాంకు బ్యాలన్స్ ను పెంచుకోవడం కోసం ఇక్కడ లేను. సంతోషంతో ప్రశాంతమైన రిటైర్మెంట్ జీవితం గడపగలను. కానీ, నటుడిగా చనిపోవాలనుకోవడం లేదు. ప్రజా సేవలోనే ప్రాణాలు విడవాలనుకుంటున్నాను. అందుకే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది’’ అని కమలహాసన్ వివరించారు. కాషాయం (బీజేపీ) అంటే తనకు ఆందోళనకరమని, తన రాజకీయాలు నలుపు రంగులోనే ఉంటాయని, అది ద్రవిడుల స్వరం, చర్మతత్వాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు.
కాషాయ రంగు పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరో తమిళ అగ్ర నటుడు రజనీకాంత్ కూడా పార్టీ ఏర్పాటు చేయనుండడంతో ఆయనతో చేతులు కలిపే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు... రజనీకాంత్ రాజకీయాలు కాషాయమైతే ఎటువంటి కూటమి కట్టేది లేదని స్పష్టం చేశారు.