Jagan: ఇప్పటికీ కేంద్ర సర్కారుపై మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయి: మంత్రి అచ్చెన్నాయుడు

  • చిట్టచివరి సమయంలోనైనా న్యాయం చేస్తారనుకుంటున్నాం
  • మిత్రధర్మాన్ని కాపాడుతూనే మా ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారు
  • అప్పట్లో రాజీనామా చేస్తే వైసీపీ నేతలు నష్టపోయేవారు
  • అందుకే ఇప్పుడు చేస్తామంటున్నారు

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ఏప్రిల్ 6న తమ లోక్‌సభ సభ్యులు రాజీనామా చేస్తే అది ఆమోదం పొందదని వైసీపీ అధినేత జగన్‌కి తెలుసని, అందుకే రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు. ఈ రోజు చంద్ర‌బాబుతో భేటీ అయిన అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. త‌మ‌ కష్టానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా సాయం అందాలని తాము కోరుతున్నామ‌న్నారు.

ఇప్పటికీ కేంద్ర సర్కారుపై త‌మ‌కు నమ్మకం, విశ్వాసం ఉన్నాయని, చిట్ట చివరి సమయంలోనైనా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై ప్ర‌క‌ట‌న‌ చేస్తారని అనుకుంటున్నామ‌ని, ఆ విశ్వాసం కూడా కోల్పోతే ఏం చేయాలో చేస్తామ‌ని అచ్చెన్నాయుడు చెప్పారు. మిత్ర ధర్మాన్ని కాపాడుతూనే త‌మ‌ ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. అంతేకానీ, వైసీపీలా తాము రాజీనామా నాటకాలు ఆడబోమ‌ని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంలో టీడీపీకి రెండే మంత్రి పదవులు ఉన్నాయని, తెలుగు దేశం పార్టీకి మంత్రి పదవులు ముఖ్యం కాదని రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని తెలిపారు. మంత్రి పదవులు పోతాయని, కేసులకు భయపడుతున్నామని ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. వైసీపీని ప్రజలు నమ్మరని, ఇన్నేళ్లు రాజీనామా చేయని వారు ఇప్పుడెందుకు చేస్తామంటున్నారని నిల‌దీశారు.

త‌మ‌ను ఎవ్వరూ గుర్తించడం లేదని, ప్రజలు తమకు మద్దతు తెలపడం లేదనే ఉద్దేశంతోనే వైసీపీ ఇటువంటి నాట‌కాలు ఆడుతోంద‌ని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చాణుక్యుడిలాంటి వ్యక్తని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసని అన్నారు. గతంలో వైసీపీ రాజీనామాలు చేస్తే నష్టపోయేదని, ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు రాజీనామా చేస్తామంటోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News