attack: తన ప్రేమను ఒప్పుకోకపోవడంతో.. గుడికి వచ్చిన అమ్మాయిపై కత్తితో యువకుడి దాడి
- కాకినాడ రూరల్ భానుగుడి సమీపంలో ఘటన
- తన ప్రేమను అంగీకరించాలంటూ ప్రతిరోజు యువతిని బతిమలాడుతోన్న ప్రసాద్
- చున్నీ పట్టుకుని ఆమెను గుడిలోంచి రోడ్డుపైకి లాక్కొచ్చిన వైనం
- అడ్డొచ్చిన స్థానికులపై సైతం దాడి
ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి కలకలం రేపిన ఘటన నిన్న రాత్రి కాకినాడ రూరల్ భానుగుడి సమీపంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే ఆకూరి ప్రసాద్ అనే యువకుడు కాకినాడ రాజీవ్ గృహకల్పలో ఉంటున్నాడు. తమ ప్రాంతానికి సమీపంలో ఉండే ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ, తన ప్రేమను అంగీకరించాలంటూ ప్రతిరోజు ఆమెను బతిమలాడుతూ తిరిగేవాడు.
ఆమె ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజులుగా బెదిరిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా సాంబమూర్తినగర్లోని కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటూ ఆ అమ్మాయి దీపాలు వెలిగిస్తుండగా.. ఆమె వద్దకు వెళ్లిన ప్రసాద్ తనను ప్రేమించాలని మళ్లీ కోరాడు. ఒప్పుకోకపోవడంతో, చున్నీ పట్టుకుని ఆమెను రోడ్డుపైకి లాక్కుంటూ వెళ్లాడు. అదే సమయంలో కత్తితో దాడి చేయడం ప్రారంభించాడు.
ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఆ ప్రేమోన్మాదిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిపై కూడా ప్రసాద్ దాడి చేశాడు. ఆ యువతితో పాటు స్థానికులు ముగ్గురికి గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రేమోన్మాది ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.