Telugudesam: ఏపీలో జూన్ 2న ‘అన్న క్యాంటీన్లు’ ప్రారంభం: మంత్రి నారాయణ
- 200 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం
- మొదటి విడతగా 33 మున్సిపాల్టీల్లో క్యాంటీన్లు
- క్యాంటీన్లకు సొంత భవనాలు
- ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడి
ఏపీలో జూన్ రెండో తేదీన 200 ‘అన్న క్యాంటీన్లు’ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సచివాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం ఈరోజు నిర్వహించినట్టు చెప్పారు. లక్ష జనాభా పైబడిన 33 మున్సిపాల్టీల్లో మొదటి విడతగా ‘అన్న క్యాంటీన్లు’ ప్రారంభించనున్నామని, 200 అన్న క్యాంటీన్లకు సొంత భవనాలు నిర్మించనున్నట్టు తెలిపారు.
తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, కర్ణాటకలోని బెంగళూరులో ఇందిరా క్యాంటీన్ల పనితీరును స్వయంగా పరిశీలించినట్లు, ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ బెంగళూరు అధికారులతో క్యాంటీన్ల నిర్వహణపై చర్చించినట్లు మంత్రి తెలిపారు. పూర్తి స్థాయి వివరాలను చంద్రబాబునాయుడుకు శుక్రవారం వివరించనున్నట్టు చెప్పారు. బెంగళూరులో ఇందిరా క్యాంటీన్లకు సొంత భవనాలు నిర్మించారని, ఇదే తరహాలో ఏపీలోనూ అన్న క్యాంటీన్లకు సొంత భవనాలు నిర్మిస్తామని అన్నారు. కూలీలు, కార్మికులకు అందుబాటులో ఉండేలా ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటిని ఏర్పాటు చేయబోయే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించినట్టు నారాయణ స్పష్టం చేశారు.