Telugudesam: ఏపీ రాజధాని ప్రాంత రోడ్లు, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలు డిసెంబర్ కు పూర్తి : మంత్రి నారాయణ
- సీఆర్డీఏ పరిధిలో ఈస్టు నుంచి వెస్ట్ మధ్య 16 రోడ్లు .. సౌత్ నుంచి నార్త్ మధ్య 18 రోడ్ల నిర్మాణాలు చేపట్టాం
- రోడ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి
- కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారు
- విలేకరులతో మంత్రి నారాయణ
ఏపీ రాజధాని ప్రాంత రోడ్లు, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. సచివాలయంలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సమావేశంలో రాజధాని పరిధిలో చేపట్టిన రోడ్లు, సివరేజ్, విద్యుద్దీకరణ పనులపై సమీక్ష నిర్వహించినట్టు నారాయణ చెప్పారు. రాజధాని అమరావతి పరిధిలో చేపట్టిన రోడ్డు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారని, సీఆర్డీఏ పరిధిలో ఈస్టు నుంచి వెస్ట్ మధ్య 16 రోడ్లు, సౌత్ నుంచి నార్త్ మధ్య 18 రోడ్ల నిర్మాణాలు చేపట్టామని అన్నారు. ఈ 34 మేజర్ రోడ్లకు ఇప్పటికే 24 రోడ్లకు టెండర్లు పిలిచి, పనులు కూడా ప్రారంభించినట్టు చెప్పారు.
రోడ్డు నిర్మాణాలు చేపట్టిన కంపెనీలు ఎటువంటి యంత్ర సామాగ్రి వినియోగిస్తున్నదీ చంద్రబాబు అడిగి తెలుసుకున్నారని, వారం రోజుల్లోగా రోడ్ల నిర్మాణాలు జరిగిన తీరుతెన్నులపై వివరాలు అందజేయాలని, 34 రోడ్ల నిర్మాణాలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, మిగిలిన 10 మేజర్ రోడ్లకు త్వరలోనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిస్తామని, రైతుల నుంచి సేకరించిన భూముల్లో చేపట్టిన రోడ్లు, ఇతర నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయని రోడ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నా, కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని నారాయణ హితవు పలికారు. ఐఏఎస్, గెజిటెడ్, నాన్ గెజిటెట్, గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగుల కోసం 3,840 ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నట్టు చెప్పారు. ఏప్రిల్ లోగా మొదటి స్లాబ్ పనులు పూర్తి చేస్తామని చంద్రబాబునాయుడుకు సంబంధిత కాంట్రాక్టర్ తెలిపారని, డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేస్తామని నారాయణ పేర్కొన్నారు.