Andhra Pradesh: కాపు రిజర్వేషన్ల కోటాను తక్షణం ఆపండి.. ఏపీ ప్రయత్నాలకు కేంద్రం బ్రేక్!
- రాష్ట్రపతి ఆమోదానికి కేంద్ర హోంశాఖ మోకాలడ్డు
- 50 శాతానికి మించి ఎలా ఇస్తారంటూ డీవోపీటీ లేఖ
- ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బిల్లును ఆమోదించిన ఏపీ
కాపు రిజర్వేషన్లకు కేంద్రం బ్రేక్ వేసింది. కాపు రిజర్వేషన్ బిల్లుకు ఇటీవల ఆమోదం తెలిపిన ఏపీ శాసనసభ దానిని గవర్నర్కు పంపింది. నిబంధనల ప్రకారం గవర్నర్ దానిని రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఆయన ఆమోదముద్ర పడిన తర్వాత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చాల్సి ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఉండవు. ఇటువంటి బిల్లు ఆమోదానికి ముందు రాష్ట్రపతి కేంద్ర హోంశాఖ సలహాలు, సూచనలు తీసుకుంటారు. హోంశాఖ దీనిపై శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) అభిప్రాయం కోరింది.
ప్రధాని ప్రత్యక్ష పర్యవేక్షణలో నడిచే డీవోపీటీ కాపు రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు వరకు వెళ్లకుండానే అడ్డుకుంది. దీనిని నిలిపివేయాలంటూ హోంశాఖకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు 1992 నాటి ఇందిరా సాహ్ని కేసును ఉటంకించింది.
నవంబరు 16, 1992లో 9 మంది సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆ కేసులో తీర్పు చెబుతూ, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ఈ తీర్పును ఉదహరిస్తూ బిల్లును నిలిపివేయాలని రాష్ట్రపతికి విన్నవించాలంటూ హోంశాఖకు డీవోపీటీ సూచించింది. 50 శాతానికి మించి కోటాను ఏ ప్రాతిపదికన, ఎందుకు ఇవ్వాలో ప్రభుత్వం చెప్పలేదన్న ఒకే ఒక్క కారణంతో డీవోపీటీ ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామన్న ఎన్నికల హామీ మేరకు టీడీపీ ప్రభుత్వం ఈ అంశంపై బీసీ కమిషన్ను నియమించింది. కమిషన్ సిఫారసు మేరకు గత డిసెంబరులో ‘ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ బిల్లు’ను శాసనసభ ఆమోదించింది.