Warangal Rural District: నేటి నుంచి సెలవులో ఆమ్రపాలి... ఐదు జిల్లాలకు ఇన్ చార్జ్ లే దిక్కు!
- మార్చి 7 వరకూ సెలవులో ఆమ్రపాలి
- 18వ తేదీన సమీర్ శర్మతో వివాహం
- ఐదు జిల్లాల్లో పడకేసిన పాలన
- ముఖ్యమైన దస్త్రాలకే ఇన్ చార్జ్ లు పరిమితం
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్, రూరల్ జిల్లాకు ఇన్ చార్జ్ బాధ్యతల్లోనూ ఉన్న ఆమ్రపాలి రెడ్డి, తన వివాహం నిమిత్తం నేటి నుంచి సెలవులో వెళ్లనున్నారు. ఆమె వివాహం మరో మూడు రోజుల్లో ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో జరగనున్న సంగతి తెలిసిందే. 18న వీరి పెళ్లి జమ్మూ కశ్మీర్ లో జరగనుండగా, ఆపై 21 వరకూ అక్కడే ఉండే కొత్త జంట, 22న హైదరాబాద్ కు తిరిగి రానుంది.
25న హైదరాబాద్ లో, 26న వరంగల్ లో రిసెప్షన్ ఇవ్వనున్న ఆమ్రపాలి దంపతులు, మార్చి 7 వరకూ హనీమూన్ నిమిత్తం టర్కీలో గడిపి రానున్నారు. ఆమె మార్చి 8 వరకూ సెలవులో ఉండనుండటంతో వరంగల్ అర్బన్ జాయింట్ కలెక్టర్ కే పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక ఇప్పటికే వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు బదిలీ అయిన తరువాత ఇన్ చార్జ్ ల ఆధ్వర్యంలో పాలన సాగుతుండగా, ఇప్పుడు మరో జిల్లా కూడా వచ్చి చేరింది. మొత్తం ఐదు జిల్లాలకు ఇన్ చార్జ్ లే కొనసాగనుండటంతో ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం జరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు, ఆసరా, ఓడీఎఫ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రజావాణి, భూ ప్రక్షాళన వంటి పథకాల విషయంలో ఆలస్యం తప్పేలా లేదు. ఇన్ చార్జ్ కలెక్టర్లు ముఖ్యమైన దస్త్రాలకే పరిమితం అవుతున్నారన్న విమర్శలూ వస్తున్నాయి.