terrorist: 165 మందిని బలితీసుకున్న కిరాతక ఉగ్రవాది అరెస్ట్!
- ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్ లో 2008లో వరుస బాంబు పేలుళ్లు
- వీటి నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆరిజ్ ఖాన్
- నేపాల్ లో సహచరుడితో ఉండగా అదుపులోకి
కరుడుగట్టిన ఇండియన్ ముజాహిదీన్ సంస్థ ఉగ్రవాది మొహమ్మద్ ఆరిజ్ ఖాన్ అలియాస్ అకా జునైద్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. 2008లో ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్ లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ బృందంలో ఇతడు కీలకమైన వ్యక్తి. నాటి బాంబు పేలుళ్లకు 165 మంది ప్రాణాలు కోల్పోగా, 535 మంది గాయాలపాలయ్యారు. ఒక్క ఢిల్లీలోనే 30 మంది మృతి చెందారు.
2008లో ఢిల్లీలోని బాట్లా హౌస్ ఫ్లాట్ లో దాగున్న ఇతడ్ని పట్టుకునేందుకు పోలీసులు ఆపరేషన్ నిర్వహించగా, పోలీసులపైనే కాల్పులు జరిపి చాకచక్యంగా తప్పించుకుపోయాడు. ఆ సందర్భంగా జరిగిన ఎన్ కౌంటర్ లో ఇన్ స్పెక్టర్ మోహన్ చాంద్ శర్మ బలయ్యారు. ఇంతటి కరుడుగట్టిన ఈ ఉగ్రవాది నేపాల్ లో తన సహచరుడు అబ్దుల్ సుభాష్ ఖురేషితో కలసి ఉండగా ఇంటెలిజెన్స్ వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. ఢిల్లీ పోలీసులకు అతడ్ని అప్పగించనున్నారు. ఇతడిపై రూ.15 లక్షల రివార్డుతో పాటు, ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ అయి ఉంది.